తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్‌ఐఆర్‌పై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నాయని, రిజర్వేషన్లపై స్పష్టత వచ్చేవరకు మనం సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదన్నారు.
ఈ రోజు(సోమవారం, అక్టోబర్ 5వ తేదీ) పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఎన్నికల యుద్ధానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల వరకు ప్రతి అంశంపై ముందస్తు కసరత్తు జరగాలి.
మీకు సర్వర్లు పనిచేస్తాయి.. మాకు మొరాయిస్తున్నాయా?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, పన్నుల సర్టిఫికెట్లు అత్యంత కీలకం. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించాలని చూస్తే చూస్తూ ఊరుకోం. సర్వర్ పనిచేయడం లేదనే పేరుతో సర్టిఫికెట్లను నిలిపివేస్తే ప్రశ్నిస్తాం. ప్రభుత్వానికి కావాల్సిన పనులకు సర్వర్లు పనిచేస్తాయి. ప్రతిపక్ష అభ్యర్థుల సర్టిఫికెట్ల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మొరాయిస్తున్నాయా?, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో వెంటనే సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేయాలి. దరఖాస్తు తీసుకోకపోయినా, సర్వర్ పనిచేయకపోయినా వీడియో ఆధారాలు సేకరించాలి.
ఆధారాలతో ఎస్‌ఈసీ ముందుకు వెళ్తాం.
ప్రతి జిల్లాలో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తే న్యాయపరంగా ఎదుర్కొందాం. సర్టిఫికెట్ల జారీలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే ఆధారాలతో ఎస్‌ఈసీ ముందుకు వెళ్తాం. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిద్దాం. ఎన్నికల ప్రక్రియ అందరికీ సమాన అవకాశాలతో జరగాల్సిందే. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి
24 గంటలూ అందుబాటులో ఉండాలి
రిజర్వేషన్లు ప్రకటించే వరకు వేచి చూడకుండా సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థులను గుర్తించాలి. ఒక్కో స్థానానికి ప్రత్యామ్నాయ అభ్యర్థులను కూడా సిద్ధంగా ఉంచాలి. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్‌కు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. అందుకే చివరి నిమిషంలో హడావుడి కాకుండా ఇప్పుడే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ప్రతి జిల్లాలో లీగల్ వార్‌రూమ్ ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఎన్నికల టీమ్ 24 గంటలూ అందుబాటులో ఉండాలి.
సమస్య ఎక్కడ రావచ్చో ముందే గుర్తించాలి..
నామినేషన్లకు అడ్డంకులు సృష్టించినా, అక్రమ కేసులు పెట్టినా వెంటనే లీగల్ టీమ్‌కు సమాచారం ఇవ్వాలి. బైండ్ ఓవర్ కేసులతో మన కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే న్యాయపరంగా ఎదుర్కోవాలి. కేసులు పెట్టి కార్యకర్తలను ఇంట్లో కూర్చోబెట్టే రాజకీయాలకు వైఎస్సార్‌సీపీ భయపడదు. సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటి నుంచే గుర్తించాలి. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎన్నికల రోజు సమస్య వచ్చాక స్పందించడం కాదు.. సమస్య ఎక్కడ రావచ్చో ముందే గుర్తించాలి
మనది ప్రజాబలం..
గ్రామ స్థాయి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు పటిష్టమైన సమన్వయ వ్యవస్థ ఉండాలి. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయంతో పనిచేయాలి. అధికార బలం వాళ్లది కావచ్చు.. ప్రజాబలం మనది. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని పోటీని అడ్డుకోవాలని చూస్తే ప్రతి అడుగునా ప్రశ్నిస్తాం.. న్యాయపరంగా పోరాడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పూర్తి శక్తితో బరిలోకి దిగుతుంది’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కూటమి ప్రభుత్వం భయపడుతోంది: లేళ్ల అప్పిరెడ్డి


