జరిమానా లెక్క తేల్చాల్సిందే | No court has given a clean chit to Ramoji and Margadarshi says Undavalli Arunkumar | Sakshi
Sakshi News home page

జరిమానా లెక్క తేల్చాల్సిందే

Aug 22 2026 4:38 AM | Updated on Aug 22 2026 4:42 AM

No court has given a clean chit to Ramoji and Margadarshi says Undavalli Arunkumar

రామోజీ, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదు

మీడియాతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

రామోజీ మరణంతో టెక్నికల్‌ కారణాలతో ఊరట పొంది.. న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.  

నిజంగా న్యాయం గెలిచి ఉంటే.. అంతా చట్ట ప్రకారమే చేస్తే.. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా డిపాజిట్ల సేకరణను నిలిపివేసి ఆ సంస్థను హఠాత్తుగా ఎందుకు మూసేశారు?  

మార్గదర్శి డిపాజిట్ల సేకరణ సక్రమమా? అక్రమమా? కేసుకు ఇదే మూలం  

డిపాజిట్లు సేకరించడం సరైనదేనని హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు.. ‘ఈనాడు’ కూడా ఆ సాహసం చేయలేదు

అది చట్ట విరుద్ధమని ఆర్బీఐ ఎప్పటి నుంచో చెబుతోంది..

డిపాజిట్ల సేకరణ ఆర్‌బీఐ చట్టానికి విరుద్ధమని తాజాగా కేంద్రం సైతం పార్లమెంట్‌లో ప్రకటించింది

చట్టవిరుద్ధమని రామోజీకి స్పష్టంగా తెలుసు కాబట్టే అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి మరీ డిపాజిటర్లకు తిరిగి చెల్లిస్తామన్నారు 

తను చేసింది తప్పు కాకపోతే వెంటనే తిరిగి చెల్లిస్తామని సుప్రీం కోర్టును ఎందుకు వేడుకుంటారు? 

ఆస్తులు అమ్మితేగానీ మార్గదర్శి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదని రంగాచారి కమిషన్‌ చెప్పింది 

రామోజీ దీన్ని నూటికి నూరు శాతం నిజం చేస్తూ డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తనకు ఉన్న మీడియా చానళ్లను విక్రయించారు 

నిజంగా చట్టబద్ధంగా చేసి ఉంటే రామోజీ ఎవరికైనా లొంగే మనిõÙనా? మరి ఆయన ఇంకెక్కడి కడిగిన ముత్యం? 

నేరం చేసిన మనిషి మరణిస్తే క్రిమినల్‌ కేసు నిలువదు.. కానీ, ఆర్థిక లావాదేవీల బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోలేరు.  

ఆర్థిక అంశాలు మిగిలి ఉంటే చట్టపరమైన ప్రక్రియ ద్వారా బకాయిల వసూలుకు అవకాశం ఉంటుందని హైకోర్టు కూడా చెప్పింది 

ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45ఎస్‌ ప్రకారం.. మార్గదర్శి అక్రమంగా వసూలు చేసిన నగదుకు రెట్టింపు వరకు జరిమానా విధించే నిబంధన ఉంది 

మార్గదర్శి అక్రమాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ను ప్రశ్నిస్తా.. పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీని సంప్రదిస్తా

సాక్షి, హైదరాబాద్, సాక్షి, అమరావతి:  మార్గదర్శి ఫైనా­న్షియర్స్‌ అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహా­రంలో జరిమానా లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. ‘సత్యం గెలిచింది.. న్యాయం నిగ్గు తేలిందని ఈనాడు చెబుతోంది! అసలు నిజం అంటే ఏమిటి? ప్రధానంగా ఈ కేసు దేనిమీద దాఖలైంది? డిపాజిట్ల సేకరణ సక్ర­మమా? అక్రమమా? కేసుకు ఇదే మూలం కదా! హెచ్‌యూఎఫ్‌ కింద రూ.వేల కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించడం ఆర్బీఐ సెక్షన్‌ 45 ఎస్‌ ప్రకారం చట్ట విరుద్ధం. దీన్ని వదిలేసి సత్యం గెలిచిందంటూ ఈనాడు ప్రచారం చేస్తోంది. 

రామోజీ మరణంతో టెక్నికల్‌ కారణాలతో ఊరట పొంది.. న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఏ వ్యవస్థా క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదు. గతంలో హైకోర్టుగానీ ఇప్పుడు సుప్రీంకోర్టుగానీ ఇలా డిపాజిట్లు సేకరించడం సరైనదేనని ఎక్కడా చెప్పలేదు. మార్గదర్శి ఎంతసేపూ సెక్షన్‌ 45 ఎస్‌ తమకు వర్తించదంటూ అడ్డగోలుగా వాదించింది. రామోజీ మరణించడంతో సడన్‌గా ప్లేటు ఫిరాయించారు’ అని ఉండవల్లి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరా­బాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో, అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు అత్యంత పవర్‌పుల్‌. సీఎంలను సైతం నిర్ణయించగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టే అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి మరీ తిరిగి చెల్లిస్తామన్నారు. తను చేసింది తప్పు కాకపోతే ఎందుకు చెల్లిస్తామంటారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా డిపాజిట్ల సేకరణను హఠాత్తుగా నిలిపివేసి ఆ సంస్థను ఎందుకు మూసేశారు? అప్పటిదాకా నాటి వైఎస్సార్‌ ప్రభుత్వం తనను వేధిస్తోందని న్యాయస్థానాలకు చెప్పిన రామోజీ వెంటనే డిపాజిట్ల సేకరణ నిలిపివేసి తిరిగి చెల్లిస్తామని సుప్రీంకోర్టును కోరారు. తను తప్పు చేయకుంటే ఎందుకు అడిగారు? మార్గదర్శి అక్రమాలపై విచారణకు నియమించిన రంగాచారి కమిషన్‌ నివేదిక ఇస్తూ.. ఆస్తులు అమ్మితేగానీ డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదని చెప్పారు. 

రామోజీ దీన్ని నూటికి నూరు శాతం నిజం చేస్తూ డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తనకు ఉన్న మీడియా చానళ్లను విక్రయించారు. అంటే దాని అర్థం ఏమిటి? నిజంగా చట్టబద్ధంగా చేసి ఉంటే ఆయన ఎవరికైనా లొంగే మనిషేనా? మరి రామోజీ ఇంకెక్కడి కడిగిన ముత్యం? ఇంత అక్రమాలకు పాల్పడినా వైఎస్సార్‌ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయడంగానీ, ఆస్తులను అటాచ్‌ చేయ­డంగానీ చేయలేదు’ అని ఉండవల్లి పేర్కొన్నారు. మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని ఆర్బీఐ ఎప్పటి నుంచో చెబుతోందని గుర్తు చేశారు. తాజాగా కేంద్రం సైతం పార్లమెంట్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ లిఖితపూర్వకంగా ప్రకటన చేసిందని తెలిపారు. 

చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు (అనధికారికంగా డిపాజిట్లను స్వీకరించడం) తేలితే జరిమానా విధించడం, రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడం లాంటి చర్యలను ఆర్బీఐ చేపడుతుందని స్పష్టం చేసిందన్నారు. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ఉండవల్లి చెప్పారు. ‘రామో­జీరావు మరణంతో ఆయనపై క్రిమి­నల్‌ కేసు కొనసాగదనేది సాధారణ న్యాయసూత్రమే. తెలంగాణ హైకోర్టు తీర్పుతో రామోజీరావుపై క్రిమినల్‌ కేసు ముగిసినా.. అక్రమంగా డిపాజిట్లు సేకరించినందుకు విధించాల్సిన జరిమానా అంశాన్ని ఆర్బీఐ తేల్చాలి. 

ఆర్థిక అంశాలు మిగిలి ఉంటే చట్టపర­మైన ప్రక్రియ ద్వారా బకాయిల వసూలుకు అవకాశం ఉంటుందని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. నేరం చేసిన మనిషి మరణిస్తే క్రిమినల్‌ కేసు నిలువదు. కానీ, ఆర్థిక లావాదేవీల బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45 ఎస్‌ ప్రకారం.. అక్రమంగా వసూలు చేసిన నగదుకు రెట్టింపు వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది’ అని ఉండవల్లి పేర్కొన్నారు.

45 ఎస్‌ ఉల్లంఘన జరిగిందా? లేదా? తేల్చలేదు
‘హైకోర్టు తీర్పు తర్వాత అత్యున్నత ధర్మాసనంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) ఎందుకు దాఖలు చేశానంటే.. గతంలో సుప్రీంకోర్టు 3 అంశాలపై తేల్చాలని హైకోర్టుకు కేసును తిప్పి పంపింది. వసూలు చేసిన వారందరికీ నగదు చెల్లింపులు జరిగాయా? రిజర్వు బ్యాంక్‌ చట్టాన్ని ఉల్లంఘించారా? ఇప్పటికే 15–20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో ట్రయల్‌ కోర్టులో విచారణ కొనసాగించాలా? మూసివేయాలా? వీటిపై తేల్చాలని హైకోర్టుకు ‘సుప్రీం’ సూచించింది. 

హైకోర్టు కొంత వరకు ఆర్‌బీఐ చట్టంలోని 45 ఎస్‌ను సమర్థించినా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం రామోజీరావు మరణించినందున మేం ప్రాసిక్యూట్‌ చేయలేమని చెప్పాయి. చనిపోయిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నిలబడదన్నది వాస్తవం. ఇదే విషయాన్ని రామోజీరావు చనిపోయిన రోజే మీడియా ఒత్తిడి చేయడంతో చెప్పా. శిక్ష ఉండదు కానీ.. ఎవరికైనా నగదు ఇవ్వాల్సి ఉంటే మాత్రం వారి వారసుల నుంచి వసూలు చేస్తారని చెప్పా. కేసు పెట్టే సమయంలో రామోజీరావును ప్రొప్రైటర్‌గా పేర్కొ­న్నారు. ప్రొప్రైటర్‌ చనిపోయారు కనుక.. ఆయన తప్పులకు ఎలాంటి సంబంధం లేదని వారసుల పక్షం వారు వాదించారు. క్రిమినల్‌ కేసు నిలబడదు. 

కానీ, 45 ఎస్‌ను ఉల్లంఘిస్తే ఏం చేయాలనేది ఆర్‌బీఐ చట్టంలో స్పష్టంగా ఉంది. ఎంత నగదైతే డిపాజిటర్ల నుంచి వసూలు చేస్తారో.. అంతకు రెట్టింపు జరిమానా విధించాలి. చట్టం రూపొందించే ముందు ఇన్ని వేల కోట్లు వసూలు చేస్తారని భావించి ఉండరు. హైకోర్టు తీర్పు­నిస్తూ.. క్రిమినల్‌ కేసును ముగిస్తున్నాం. సివిల్‌ లయబిలిటీ (ఆర్థిక అంశాలు) ఉంటే మార్గదర్శి నుంచి ఆర్‌బీఐ గానీ ఇతరులెవరైనా గానీ వసూలు చేసుకునేందుకు ‘ఓపెన్‌’­గా ఉంచుతున్నామని చెప్పింది. 45 ఎస్‌ ఉల్లంఘన జరి­గిందా? లేదా? తేల్చలేదు. ఆర్‌బీ­ఐ నా వాదనలను మాత్రమే ప్రస్తావించింది. 45 ఎస్‌ తేల్చడానికే నేను సుప్రీంను ఆశ్రయించా’ అని ఉండవల్లి పేర్కొన్నారు.

ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందనే లేదు
‘ఎస్‌ఎల్‌పీ వేయడానికి ముందే ఏపీ, తెలంగాణ సీఎంలకు, ఆర్‌బీఐకి లేఖలు రాశా. ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నా లేఖకు ఎలాంటి స్పందన ఇవ్వని ఈ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో మాత్రం వకాలత్‌ వేసి.. హైకోర్టులో చెప్పిందే మళ్లీ చెప్పాయి. ఆర్‌బీఐ మాత్రం ‘ఈ విషయాన్ని ఇకపై కొనసాగించబోం’ అని సమాధానం ఇచ్చింది. సెక్షన్‌ 45 ఎస్‌ ఉల్లంఘనపై హైకోర్టులో గట్టిగా వాదించిన ఆర్‌బీఐ.. ఆ తర్వాత ఎందుకు కేసును కొనసాగించబోమని లేఖ ఇచ్చిందో తేలాలి. 

ఈ అంశాన్ని పార్లమెంట్‌ ఆర్థిక వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఆర్‌బీఐ వైఖరిపై ప్రశ్నిస్తా. అవసరమైతే ఆర్‌బీఐ గవర్నర్‌ను కూడా కమిటీ ముందుకు పిలిపించే అవకాశం ఉంది. పార్లమెంట్‌ కమిటీకి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం నాకుంది. హెచ్‌యూఎఫ్‌ (హిందూ అవిభక్త కుటుంబం) పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడంపై రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఆర్‌బీఐ చట్ట ప్రకారం అనుమతి లేకుండా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదంది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ఆర్‌బీఐ.. వ్యాపార పరిమితులు, జరిమానాలు, రిజిస్ట్రేషన్‌ రద్దు వంటి చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదే నా వాదనకు కీలక ఆధారం’ అని ఉండవల్లి తెలిపారు.

వ్యక్తిగత కక్షతో కేసు నడపలేదు..
‘మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో వ్యక్తిగత కక్షతో పోరాడటం లేదు. రామోజీరావును నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. ఈ కేసుతో నాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదు. ఈ ఉల్లంఘన భవిష్యత్‌లో మరికొందరికి ఉదాహరణగా మారకూడదనే ఉద్దేశంతోనే న్యాయ పోరాటం చేస్తూ వచ్చా. పెద్ద సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్‌లో మరికొందరూ ఇలానే చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి. చట్ట ఉల్లంఘనకు జరిమానా విధించాల్సిందే. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలంటే సంబంధిత చట్టాల ప్రకారం సంస్థను ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఆర్‌బీఐ అనుమతులు తీసుకోవాలి. 

మార్గదర్శి మాత్రం హెచ్‌యూఎఫ్‌తో కార్యకలాపాలు నిర్వహించిందనేది నా ప్రధాన అభ్యంతరం. అనారోగ్య కారణాలు, ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో ఇటీవల కోర్టుకు వెళ్లలేకపోయా. కోట్ల రూపాయలిచ్చి న్యాయవాదిని నియమించుకునే శక్తి నాకు లేదు.  తెలిసిన మంచి సీనియర్‌ న్యాయవాదిని నియమించాం. పార్టీ ఇన్‌ పర్సన్‌గా నేనే వాదనలు వినిపించి సమర్థంగా చెప్పేవాడిని. ఏదేమైనా కోర్టు తీర్పును గౌరవిస్తా. న్యాయమూర్తుల అభిప్రాయాలను ప్రశ్నించబోను. కోర్టుకు సంబంధించినంత వరకు ఈ అధ్యాయం ముగిసింది. ఇక జరిమానా, ఆర్థిక బాధ్యతపై ఆర్‌బీఐ, ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి’ అని ఉండవల్లి చెప్పారు.

ఆర్‌బీఐ తీరు విస్మయకరం
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో ఇటీవల ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది సీఎం చంద్రబాబు తరహాలో వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ను గుర్తుకు తెస్తోంది. ఆర్‌బీఐ మొదటి నుంచి మార్గదర్శి, రామోజీరావులకు వ్యతిరేకంగా హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించింది. అలాంటి ఆర్‌బీఐ ఇటీవల మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ విషయంలో చేతులెత్తేసింది. రామోజీ అక్రమాలను హైకోర్టులో తీవ్రస్థాయిలో ఎండగట్టిన ఆర్‌బీఐ ఇటీవల విస్మయకర నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి ఫైనాన్షియల్‌ డిపాజిట్ల అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకునేది లేదని, దీనిపై నిర్ణయం తీసేసుకున్నామని రామోజీ అక్రమాలపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన నాకు రాతపూర్వకంగా చెప్పింది. కేసు కొట్టివేతపై సుప్రీంకోర్టు నిర్ణయానికి ముందే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా అనుమానాలున్నాయి.

ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తున్నారని, ఇలా చేయడంపై నిషేధం ఉందని హెచ్చరిస్తూ 1997లో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు లేఖ పంపిన రిజర్వ్‌ బ్యాంక్‌ 

హెచ్‌యూఎఫ్‌కు సెక్షన్‌ 45(ఎస్‌) వర్తిస్తుందని, అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఏ రకంగానూ, ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి వీల్లేదని తేల్చి చెబుతూ రామోజీరావుకు 1999లో ఆర్‌బీఐ పంపిన లేఖ 

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసును ఇకపై పట్టించుకోవద్దని నిర్ణయం తీసుకున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు ఈ ఏడాది జనవరి 9న ఆర్‌బీఐ పంపిన లేఖ 

హెచ్‌యూఎఫ్‌లపై వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రశ్నలు
ఇటీవల ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్‌లో హెచ్‌యూఎఫ్‌ విషయంలో కేంద్రాన్ని కీలక ప్రశ్నలు అడిగారు. ఆదాయపు పన్ను చట్టపరమైన స్థితికి సంబంధించి హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) హోదా ఏమిటి? హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు లేదా ఇతర రూపాల్లో ప్రజల నుంచి  డబ్బులు వసూలు చేసేందుకు అనుమతి ఉందా? హెచ్‌యూఎఫ్‌ చిట్‌ ఫండ్‌ కంపెనీగా లేదా ఎన్‌బీఎఫ్‌సీగా ఏర్పాటు చేసి ప్రజల నుండి డబ్బు వసూలు చేయవచ్చా? ఆర్‌బీఐ అనుమతి లేకుండా ప్రజల నుండి డబ్బు వసూలు చేసిన కంపెనీలపై ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ఏమిటి? అన్న ప్రశ్నలు అడిగారు.

ప్రజల నుంచి హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు తీసుకోవడం చట్టవిరుద్ధమన్న కేంద్రం..
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నలకు కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానం ఇచ్చారు. ఆర్‌బీఐ చట్ట నిబంధనల ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు (నమోదు కాని సంస్థలు కావడం వల్ల) ఎన్‌బీఎఫ్‌సీలు లేదా చిట్‌ ఫండ్‌ కంపెనీలుగా నమోదు కాలేవు. అవి ప్రజల నుంచి డబ్బు వసూలు చేయలేవని తేల్చి చెప్పారు. అంతేకాక చిట్‌ ఫండ్‌ కంపెనీలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలను విచారించే అధికారం (ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45–టీ కింద క్రిమినల్‌ కేసు నమోదు చేయడం) రిజర్వ్‌ బ్యాంక్, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సంయుక్తంగా ఉంటుందన్నారు. చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే, ఆర్‌బీఐ వ్యాపార పరిమితులు విధించడం, ఆర్థికపరమైన జరిమానా విధించడం, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం వంటి నియంత్రణ చర్యలను చేపడుతుందని చెప్పారు.

ఆర్‌బీఐని అడిగే సమాధానం చెప్పిన మంత్రి
సాధారణంగా పార్లమెంట్‌లో ఎవరైనా సభ్యుడు ప్రశ్న అడిగితే సంబంధిత శాఖామంత్రి ఆ శాఖకు చెందిన విభాగాలు, అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెప్పించుకుంటారు. వాటిని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటారు. ఆ తరువాతే సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. ఇక్కడ కూడా వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్న ఆర్‌బీఐ పరిధిలోకి వస్తుంది. అందుకే కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి, సమాధానం ఇచ్చే ముందు ఆర్‌బీఐ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే సమాధానం ఇచ్చారు. 

ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. అలా డిపాజిట్లు వసూలు చేస్తే జరిమానాలు వసూలు చేసే అధికారం ఆర్‌బీఐకి ఉందని మంత్రి చెప్పారు. దీని ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్ల సేకరణ కూడా చట్ట విరుద్ధమే అవుతుంది. అలాంటప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్ల సేకరణ కేసును ఇకపై పట్టించుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ ఎలా చెబుతుంది? ఏ చట్ట నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకుంది? ఏ స్థాయిలో ఈ నిర్ణయం జరిగింది? చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించాల్సిన ఆర్‌బీఐ ఆ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంది? దీని వెనుక ఏం మంత్రాంగం జరిగింది?

జరిమానా విధించాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై ఉంది
రామోజీరావు చనిపోయారు కాబట్టి, తెలంగాణ హైకోర్టు కేసు కొట్టేసింది.. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. మార్గదర్శి, రామోజీరావు తాము చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించామని కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో వారికి జరిమానా విధించాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై ఉంది. ప్రజల నిధుల నిర్వహణకు సంబంధించి మార్గదర్శి చట్టబద్ధమైన ఉల్లంఘనలను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టే విచారణ సందర్భంగా చెప్పింది. ఒకవేళ రామోజీరావు బతికి ఉంటే..? కథ మరోలా ఉండేది. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు మార్గదర్శి, రామోజీరావులు డిపాజిట్లు వసూలు చేయడం చట్టవిరుద్ధమా? కాదా? అన్న సంగతిని తేల్చాల్సి వచ్చేది. 

డిపాజిట్లు వసూలు చేసినట్లు మార్గదర్శినే స్వయంగా అంగీకరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. మార్గదర్శి, రామోజీ ప్రధాన వాదన ఏమిటంటే, డిపాజిట్లు వసూలు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ, మొత్తం డబ్బును తిరిగి ప్రజలకు చెల్లించామని చెప్పారు. డిపాజిట్లు వసూలు చేయడం అక్రమమా? సక్రమమా? అన్న దాని జోలికి వెళ్లకుండా, డిపాజిట్లను వెనక్కి ఇచ్చేశామనే ప్రతీ చోటా చెబుతూ వచ్చారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారా? లేదా? అన్నదే ముఖ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది.దీనిపైనే ప్రధానంగా విచారణ జరుపుతామని పేర్కొంది. చట్ట విరుద్ధంగా వసూలు చేయడం నేరమా? కాదా? అన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తామంది. 

డిపాజిట్లు వసూలు చేయడానికి, వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడానికి మధ్య తేడా ఉందని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. అనంతరం ఈ వ్యాజ్యాలు మరో ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ ధర్మాసనం.. మార్గదర్శి డిపాజిట్ల స్వీకరణ చట్ట ప్రకారం జరిగిందా? చట్ట విరుద్ధంగా జరిగిందా? అన్న అంశం జోలికి వెళ్లకుండానే రామోజీ రావు మరణించినందుకు కేసును కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చొరవ తీసుకుంటే తగిన చర్యలకు ఆస్కారం ఉంటుంది. వాస్తవానికి మార్గదర్శి చట్ట ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అయితే ఈ విషయంలో అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి, ఆర్‌బీఐ రంగంలోకి దిగాలి.

రెండింతల జరిమానా లేదా రెండేళ్ల జైలుశిక్ష 
ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేసినందుకు విధించాల్సిన జరిమానాల నుంచి మార్గదర్శి తప్పించుకుంటున్నట్లేనా? మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు ప్రజల నుంచి రూ.2600 కోట్ల మేర డిపా­జిట్లు వసూలు చేసినట్లు ఆర్‌బీఐ హైకోర్టుకు నివేదించింది. ఈ డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధంగా జరిగిందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రామోజీరావు మర­ణించకుండా ఉండి ఉంటే, ఆయన నేతృత్వంలో నడిచిన డిపాజిట్ల సేకరణ వ్యవహారం చట్టవిరుద్ధమని తేలే అవకా­శం ఉండేది. ఇందుకు సెక్షన్‌ 45(టీ) ప్రకారం వసూలు చేసిన మొత్తానికి రెండింతల జరిమానా లేదా రెండేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.

మార్గదర్శి1997 నుంచి 2006 వరకు వసూలు చేసిన రూ.2600 కోట్లకు రెండింతలు అంటే రూ.5200 కోట్లు జరిమానాగా చెల్లించాల్సి వచ్చేది. ఎందుకంటే, మార్గదర్శి, రామోజీ రావులు చట్ట నిబంధనలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఆర్‌బీఐ హైకోర్టుకు స్పష్టంగా చెప్పింది. అంతేకాక హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) లీగల్‌ పర్సన్‌­కాదని, అది కొందరు వ్యక్తుల సమూహమని, కర్త ద్వారా హెచ్‌యూఎఫ్‌ పనిచేస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. అందువల్ల హెచ్‌యూఎఫ్‌ కర్తకు సెక్షన్‌ 45(ఎస్‌) వర్తిస్తుందని ఆర్‌బీఐ తన కౌంటర్‌లో స్పష్టంగా పేర్కొంది. ఆర్‌బీఐ తలచుకుంటే మార్గదర్శి నుంచి జరిమానా వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

హఠాత్తుగా అస్త్రసన్యాసం..
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో రిజర్వ్‌ బ్యాంక్‌ హైకోర్టులో గట్టిగా న్యాయ పోరాటం చేసింది. మార్గదర్శికి వ్యతిరేకంగా వాదనలు వినిపించింది. ప్రాథమిక ఆధారాలను సైతం కోర్టు ముందుంచింది. మార్గదర్శి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రూ.2600 కోట్లను ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని హైకోర్టుకు చెప్పింది. ఇందుకు గాను రామోజీరావును ప్రాసిక్యూట్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. చట్ట నిబంధనల ఉల్లంఘనకు రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పింది.

అంతేకాక వసూలు చేసిన రూ.2600 కోట్ల మొత్తానికి రెండింతల జరిమానా కూడా విధించాలని తేల్చి చెప్పింది. ఈ స్థాయిలో మార్గదర్శిపై న్యాయస్థానంలో పోరా­డిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల కాలంలో మౌనందాల్చింది. మార్గదర్శిపై అస్త్రసన్యాసం చేసింది. మార్గ­దర్శిపై కేసును పట్టించుకునేది లేదని, ఈ మేర నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ మేనేజర్‌ ఆశీష్‌ దర్యాని లిఖిత­పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అంత పోరాడిన ఆర్‌బీఐ ఎందుకు సడన్‌గా ఇలా మారి­పోయిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మార్గదర్శికున్న పలుకుబడి, ముఖ్యమంత్రి చంద్ర­బాబు మద్దతు, కేంద్ర పెద్దలకు చంద్రబాబుతో అవసరాలు వెరసి ఆర్‌బీఐ పోరాటాన్ని నీరుగార్చాయి.

నాంపల్లి.. హైకోర్టు.. సుప్రీంకోర్టు.. 
మళ్లీ హైకోర్టు.. మళ్లీ సుప్రీంకోర్టు...
2006లో నా ఫిర్యాదుతో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమాల డొంక కదిలింది. గత 20 ఏళ్లుగా  మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తున్నా. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధీకృత అధికారి కృష్ణరాజు 2008లో ఇచ్చిన ఫిర్యాదుతో నాంపల్లిలో మొదట విచారణ మొదలైంది. అప్పటి నుంచి హైకోర్టు.. సుప్రీంకోర్టు.. మళ్లీ హైకోర్టు.. చివరకు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడిచింది. 2024లో సుప్రీంకోర్టు మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టుకు తిరిగి పంపింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో అన్నీ అంశాలపై లోతైన విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అయితే తెలంగాణ హైకోర్టు కేవలం రామోజీ మరణం వరకు పరిమితమై, అత్యంత కీలకమైన డిపాజిట్ల సేకరణలో చట్ట ఉల్లంఘనలను విస్మరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement