కాకినాడలో ఆందోళన చేపట్టిన వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు
సమస్యలు పరిష్కరించలేమని తెగేసి చెప్పిన సర్కార్
నేడు సాధారణ వైద్యసేవలు బహిష్కరించి నిరసన
రేపటి నుంచి అత్యవసర సేవలకూ ఉద్యోగులు దూరం
సాక్షి, అమరావతి: వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాటలోకి వెళ్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించలేమని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో సమ్మె చేయాలని వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) నిర్ణయించింది. దీనిలో భాగంగా వైద్యశాఖ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్‌లు, ఇతర పారామెడికల్ సిబ్బంది మంగళవారం సాధారణ వైద్య సేవలను బహిష్కరించి నిరసన తెలుపనున్నారు. ఇక బుధవారం నుంచి అత్యవసర సేవలనూ బహిష్కరించి సమ్మె చేయనున్నట్టు జేఏసీ ప్రకటించింది.
సమ్మె కార్యాచరణలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ధర్నా చౌక్‌లలో టెంట్‌లు వేసి ఆందోళనలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వైద్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సెకండరీ హెల్త్, డీఎంఈ పరిధిలో మొత్తం 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.
సమస్యల పరిష్కారం వీలుపడదు
ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వడంతో సోమవారం సచివాలయంలో వైద్యశాఖ కార్యదర్శి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ చక్రధర్‌బాబు, ఇతర అధికారులు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలమైనట్టు జేఏసీ అధ్యక్షుడు కోటేశ్వరరావు, కన్వీనర్ అజయ్‌కుమార్ తెలిపారు. దీంతో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉద్యోగుల డిమాండ్‌లను పరిష్కరించే పరిస్థితి లేదని చర్చల సందర్భంగా అధికారులు చెప్పినట్టు సమాచారం.
కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లు ఇవి..
⇒ అర్హులైన ఉద్యోగుల సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయాలి.
⇒ రెగ్యులరైజ్ చేసే వరకు పే+డీఏ+హెచ్‌ఆర్‌ఏ కలిపి వంద శాతం గ్రాస్ వేతనం పునరుద్ధరించాలి.
⇒ అమలులోకి వచ్చిన వేతన తగ్గింపును సమీక్షించాలి.
⇒ భవిష్యత్‌లో వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి.
⇒ పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లపై ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, నిర్థిష్ట కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలి.
⇒ విధుల్లో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం అందించాలి. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
⇒ పరస్పర, స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి.
⇒ శాశ్వత ఉద్యోగులకు ఇచ్చినట్లే కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెయిడ్ సిక్ లీవ్స్, ఈహెచ్‌ఎస్ కార్డులు మంజూరు చేయాలి.


