విఫల ప్రయోగం వద్దు.. | Government initiates exercise to privatize electricity distribution in Amaravati | Sakshi
Sakshi News home page

విఫల ప్రయోగం వద్దు..

Nov 20 2026 5:52 AM | Updated on Nov 20 2026 5:52 AM

Government initiates exercise to privatize electricity distribution in Amaravati

అమరావతిలో విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కసరత్తు 

ఇప్పటికే ఒడిశాలో నాలుగు పంపిణీ సంస్థల ప్రయోగం విఫలం 

దేశవ్యాప్తంగా 28 ఫ్రాంచైజీల్లో 11 మాత్రమే కొనసాగింపు 

మహారాష్ట్రలో ఒప్పందాల రద్దు.. మధ్యప్రదేశ్‌లో కోర్టు వివాదాలు

ప్రజాధనంతో నడుస్తున్న విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ 

దానిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రాష్ట్రంలో కుట్ర 

చంద్రబాబు గత హయాంలోనూ 53 సంస్థలు ప్రైవేటీకరణ 

వ్యక్తుల చేతుల్లోకి విద్యుత్‌ వ్యవస్థ వెళితే మరింతగా చార్జీల మోత 

విద్యుత్‌ సంస్థల ప్రస్తుత ఉద్యోగులు, ఇంజినీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం 

సాక్షి, అమరావతి : ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌పై ప్రైవేటు కంపెనీలకు వ్యాపార అవకాశం కల్పించే సమాంతర పంపిణీ అనుమతి(పారలర్‌ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌) ప్రతిపాదనపై అటు ఉద్యోగుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విధానం అమల్లోకొస్తే.. ప్రభుత్వ డిస్కంలే లైన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల నిర్వహణ, మరమ్మతులు, విస్తరణ బాధ్యతలు మోస్తూ.. అదే మౌలిక వసతులపై ప్రైవేటు సంస్థలు లాభాలు పొందే పరిస్థితి వస్తుంది. అంటే జనం సొమ్ముతో ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు ప్రయోజనం పొందడానికి ప్రభుత్వమే రాచబాట వేస్తోంది. అమరావతిలో తొలుత మోడల్‌గా మొదలుపెట్టి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. 

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు ఏపీట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోలను సైతం ప్రైవేటు పెత్తనంలోకి తెచ్చేందుకు కుట్రలు పన్నుతోంది. నిజానికి ప్రైవేటుకు దోచిపెట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజాం షుగర్స్, ఆల్విన్‌ వంటి సంస్థలతో పాటు దాదాపు 53 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇప్పుడు ఇంధన రంగం వంతు వచ్చింది. విద్యుత్‌ పంపిణీ వ్యాపారంపై ప్రైవేటు కన్ను పడింది. దానికి అండగా కూటమి ప్రభుత్వం నిలబడి, ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది. ఉద్యోగులు, ఇంజినీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.  

ఇప్పటికే చార్జీల మోత  
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే విద్యుత్‌ చార్జీల భారం వేస్తూ వస్తోంది. తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్‌ చార్జీలు పెంచింది. 2024–25లో రూ.2,787.18 కోట్లు, 2025–26లో రూ.2,800.28 కోట్లు వసూలు చేసింది. మరో రూ.555.30 కోట్ల భారం కూడా ప్రతిపాదన దశలో ఉందని చెబుతోంది. ఈ లెక్కల ప్రకారం మొత్తం భారం రూ.21,628.12 కోట్లకు చేరుతుంది. ఇంతలా చార్జీల భారం వేసి, అస్సలు పైసా కూడా పెంచలేదని అబద్ధాలు చెబుతోంది. ఇక ప్రైవేటుకు అప్పగిస్తే చార్జీల పెంపునకు మరింతగా గేట్లు ఎత్తేసినట్లు అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

పోటీ పెరిగి చార్జీలు తగ్గుతాయని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ, ఇప్పటికే మొబైల్‌ ఇంటర్నెట్‌ వంటి అంశాల్లో మోసాలను చవిచూసిన ప్రజలు.. రానున్న రోజుల్లో విద్యుత్‌ చార్జీలకూ అదే సూత్రాన్ని ప్రైవేటు సంస్థలు అవలంభిస్తాయని భయపడుతున్నారు. తొలుత తక్కువకు ఇచ్చి, జనానికి అలవాటు అయ్యాక చార్జీలు పెంచేస్తారనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదీగాక జనం సొమ్ముతో నిర్మించే విద్యుత్‌ వ్యవస్థ మొత్తాన్నీ ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేసుకోవడానికి ఇస్తామంటున్నారు. అదీగాక ప్రజల డబ్బుతో నిరి్మంచిన నెట్‌వర్క్‌.. నిర్వహణ, మరమ్మతులు, పీపీఏలు, రుణాల భారం ప్రభుత్వ డిస్కంలదే అంటున్నారు. అంటే ఈ వ్యవస్థ దెబ్బతింటే ఖర్చు డిస్కంలు పెట్టాలి. వాడుకుని లాభాలు వస్తే మాత్రం ప్రైవేటు సంస్థలు తీసుకోవాలి. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న ‘చంద్ర’నీతి. 

అనేక రాష్ట్రాల్లో విఫలం  
విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయోగాలు అమలు చేసిన పలు రాష్ట్రాల్లో ఒప్పందాలు రద్దు కావడం, బకాయిలు పేరుకుపోవడం, పెట్టుబడుల హామీలు నెరవేరకపోవడం, న్యాయ వివాదాలు తలెత్తడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ప్రాయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ 2025లో రూపొందించిన అధ్యయనం ప్రకారం.. 2008–2025 మధ్య తొమ్మిది రాష్ట్రాల్లో కుదిరిన 28 విద్యుత్‌ పంపిణీ ఫ్రాంచైజీల్లో కేవలం 11 మాత్రమే కొనసాగుతున్నాయి. మిగిలిన వాటిలో ఒప్పందాల రద్దు, కార్యకలాపాలు ప్రారంభించలేకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

దేశంలో విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణకు సంబంధించి ఒడిశా అనుభవం ప్రధాన ఉదాహరణగా నిలుస్తోంది. 1999లో నాలుగు ప్రాంతీయ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించారు. అయితే, ఆ సంస్థలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. బకాయిల చెల్లింపులు, ఆరి్థక ఇబ్బందులు, పంపిణీ వ్యవస్థలో నష్టాలు ప్రధాన సమస్యలుగా మారాయి. చివరకు ప్రైవేటు సంస్థలు తప్పుకోవడం, లైసెన్సుల రద్దు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలోనూ ప్రైవేటు ఫ్రాంచైజీల నిర్వహణలో సమస్యలు ఎదురయ్యాయి. ఔరంగాబాద్‌లో జీటీఎల్‌ సంస్థతో కుదిరిన పంపిణీ ఒప్పందాన్ని 2014 నవంబర్‌ 10న, జలగావ్‌లో క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని 2015 ఆగస్టు 10న రద్దు చేశారు. 

బిల్లుల చెల్లింపులకు సంబంధించిన సమస్యలు ఇందుకు ప్రధాన కారణం. నాగ్‌పూర్‌లోనూ ప్రైవేటు ఫ్రాంచైజీ నిర్వహణ కొనసాగలేదు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, సాగర్, ఉజ్జయినిలో 2012లో ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థకు 15 ఏళ్ల కాలపరిమితితో పంపిణీ ఫ్రాంచైజీలు అప్పగించారు. అయితే, 2015 నాటికి ఈ మూడు ఒప్పందాలూ రద్దయ్యాయి. బిల్లింగ్, నిర్వహణ, మరమ్మతులు, ఒప్పంద నిబంధనల అమలుపై విభేదాలు తలెత్తాయి. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, రాంచీల్లో ఫ్రాంచైజీ ఒప్పందాల అమలు, బాధ్యతల స్వా«దీనానికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్, గయా, భాగల్‌పూర్‌ ప్రాంతాల్లోనూ ఒప్పంద బాధ్యతలు, బకాయిలు, నిర్వహణకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోనూ కార్యకలాపాల స్వాధీన ప్రక్రియ ఆశించిన రీతిలో ముందుకు సాగలేదు.

ఒప్పందం రద్దయితే ప్రభుత్వంపైనే భారం 
ప్రాయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ అధ్యయనం ప్రకారం..పనిచేయని ఫ్రాంచైజీల్లో 52 శాతం ఒప్పందాలు బకాయిల చెల్లింపులు లేదా పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం వల్ల నిలిచిపోయాయి. మరో 23 శాతం సంస్థలు నిర్వహణ సమస్యలు, స్థానిక వ్యతిరేకత కారణంగా కార్యకలాపాలనే ప్రారంభించలేకపోయాయి. ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన సంస్థలు పెట్టుబడులు పెట్టి, సేవలను నిరంతరంగా అందిస్తాయన్న హామీ లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఒప్పందం మధ్యలో రద్దయితే పంపిణీ బాధ్యతలను తిరిగి ప్రభుత్వ సంస్థలు చేపట్టాల్సి రావచ్చు. ఆస్తుల స్వా«దీనం, బకాయిల పరిష్కారం, ఉద్యోగుల సేవా ప్రయోజనాలు, వినియోగదారుల ఫిర్యాదులు, న్యాయ వివాదాల పరిష్కారం వంటి అంశాలు సమస్యాత్మకంగా మారవచ్చు. ప్రజాధనంతో నిర్మించిన సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుళ్లు, ఇతర మౌలిక సదుపాయాలపై నియంత్రణ ఎలా ఉంటుందన్నదీ కీలకమే. 

అంటే ఒప్పందాలు రద్దయినప్పుడు బకాయిల లెక్కలు, ఆస్తుల బదిలీ, నిర్వహణ బాధ్యతల మార్పు వంటి అంశాలు ప్రభుత్వానికి అదనపు భారంగా మారే అవకాశం ఉంది. దేశంలోని ఈ అనుభవాల నేపథ్యంలో అమరావతిలో విద్యుత్‌ పంపిణీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి, వినియోగదారులకు కొత్త చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. డిస్కంలు భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలను అంచనా వేసి దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంటాయి. కొన్ని ఒప్పందాల వ్యవధి 25 ఏళ్ల వరకు ఉంటుంది. ఎక్కువ విద్యుత్‌ను వాడే వినియోగదారులు ప్రైవేటు సంస్థల వైపు మళ్లితే.. ఇప్పటికే కుదుర్చుకున్న పీపీఏల చెల్లింపులు, స్థిర వ్యయాలు, రుణభారం ఎవరు భరిస్తారు. లైన్‌ తెగినా, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా, ఫీడర్‌ విఫలమైనా నెట్‌వర్క్‌ నిర్వహణ బాధ్యత ప్రభుత్వ డిస్కమ్‌పైనే ఉంటే.. అదే నెట్‌వర్క్‌ను ఉపయోగించి ప్రైవేటుకు వ్యాపార హక్కులు ఎందుకు. అనే ప్రశ్నలు ఇంధన రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement