రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం: సజ్జల | Sajjala Ramakrishna Reddy Teleconference With Ysrcp Key Leaders | Sakshi
Sakshi News home page

రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం: సజ్జల

Aug 21 2026 9:04 PM | Updated on Aug 21 2026 9:07 PM

Sajjala Ramakrishna Reddy Teleconference With Ysrcp Key Leaders

సాక్షి, తాడేపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స‌ర్‌లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల అన్నారు.

ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర స్థాయి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు, అసెంబ్లీ పరిశీలకులతో ఆయ‌న టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసేందుకు నెలాఖరు వరకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

గత నాలుగైదు నెలలుగా బూత్‌ స్థాయిలో బీఎల్‌ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సూచించారు.

17.29 లక్షల అనుమానాస్పద ఓట్ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి
ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. ఇదే సమయంలో చిరునామా మార్పులు, ఇతర సవరణలకు సంబంధించిన దరఖాస్తులను కూడా అవసరాన్ని బట్టి సమర్పించాలని సూచించారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల తెలిపారు.

డూప్లికేట్ ఓట్ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం
ఒకే పేరుకు లేదా ఇతర వివరాలకు దగ్గరగా ఉన్న ఓటర్లు వాస్తవంగా ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అనే అంశాన్ని బీఎల్‌ఏలు స్థానికంగా నిర్ధారించాలని సూచించారు. తమకు చెందిన ఓటు అయితే దాన్ని కొనసాగించేలా, తమకు సంబంధం లేని లేదా డూప్లికేట్‌గా గుర్తించిన ఓటుపై అవసరమైన అభ్యంతరం దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీఎల్‌ఏల ద్వారా వచ్చిన సమాచారాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్లు సమీకరించి సంబంధిత ఈఆర్‌ఓలకు సమర్పించాలని, సమర్పించిన ప్రతిసారీ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో అభ్యంతరాలపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ రసీదులు, ఇతర పత్రాలు ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేలా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

బ‌య‌ట ఉన్న ఓట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం అవ‌స‌రం
క్లస్టర్ ఇన్‌చార్జీలు, కంట్రోల్ రూమ్‌లు, టాస్క్‌ఫోర్స్, పార్లమెంట్ మరియు అసెంబ్లీ పరిశీలకుల సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌కు సంబంధించిన అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపైనా వచ్చిన జాబితాలను పరిశీలించి, అవసరమైన అభ్యంతరాలను సమిష్టిగా సమర్పించాలని చెప్పారు. ఆగస్టు 27, 28 తేదీల నాటికి ప్రధాన ప్రక్రియను పూర్తి చేసి, నెలాఖరు చివరి రెండు రోజుల్లో తుది పరిశీలనకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఆగస్టు 30 తర్వాత అవకాశాలు పరిమితమవుతాయని, అందువల్ల ప్రస్తుతం ఉన్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారని, ఆ అవకాశాన్ని బీఎల్‌ఏలు వినియోగించుకుని ఓటర్ల జాబితా, దరఖాస్తులు, నోటీసులు, సవరణల వివరాలను పరిశీలించాలని సూచించారు. బయట ఉన్న ఓటర్లకు సంబంధించిన అంశాల్లో వారికి అందుబాటులో ఉన్న విధానాలపై అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైన సమాచారాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. స‌ర్ ప్రక్రియను క్రమబద్ధంగా పూర్తి చేయడం ద్వారా అర్హులైన ఓటర్ల ప్రయోజనాలను కాపాడటంతో పాటు భవిష్యత్ ఓటర్ల జాబితా సవరణల్లో కూడా ఇబ్బందులు తగ్గుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త‌పై 25న వైఎస్ జ‌గ‌న్ దిశానిర్దేశం  
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజులు పార్టీకి చెందిన సిబ్బంది, సహాయకులు, నియోజకవర్గ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి స్పష్టమైన టార్గెట్లు కేటాయించి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement