సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయమే జరుగుతుందని.. ఆయన పక్కా రాయలసీమ అభివృద్ధి నిరోధకుడని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ, పార్టీ రైతు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నేతలతో కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. పాలకుల మొద్దునిద్రను విడదీసేందుకు, రాయలసీమ రైతుల హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీమ ప్రాంత రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..
సీమపై చంద్రబాబుది మొదటి నుంచీ కక్షపూరిత వైఖరే..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలం రిజర్వాయర్‌లో దాదాపు 185 టీఎంసీల నీరు చేరింది. డ్యామ్ 90 శాతం నిండి పూర్తి స్థాయికి చేరువలో ఉంది. కానీ దానిపై ఆధారపడిన రాయలసీమ రిజర్వాయర్లన్నీ సగానికి పైగా ఎండిపోయి ఉన్నాయి. రైతులకు మేలు చేయాల్సింది పోయి, పంటలు వేసుకోవద్దని బాబు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
రైతులను వ్యవసాయానికి, భూములకు దూరం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు?. శ్రీశైలం నిండితే దిగువన ఉన్న వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు, గోరకల్లు, ఔకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, చిత్రావతి ప్రాజెక్టులు ఎందుకు నిండటం లేదు? 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 4 నుంచి 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు? సీమ ప్రాజెక్టులను ఎండగడతామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా మాట ఇచ్చారా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,400 క్యూసెక్కులు అయితే.. కేవలం 8 వేల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. 850 అడుగులు దాటిన తర్వాత కనీసం 30 నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని వదిలే అవకాశం ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారు?.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు
గతంలో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' ప్రాజెక్టును తలపెట్టారు. 90 శాతం పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టును చంద్రబాబు.. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నిలిపివేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే 800 అడుగుల నుంచే రోజుకు 80 వేల క్యూసెక్కుల వరద నీటిని ఒడిసిపట్టి సీమ ప్రాజెక్టులన్నింటినీ క్షణాల్లో నింపేవాళ్లం. అలాంటి మహోన్నత ప్రాజెక్టును గతంలో 'బురద నీళ్లు' అంటూ చంద్రబాబు హేళన చేశారు. అలాగే హంద్రీ-నీవా ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైయస్.జగన్ ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, దాన్ని 3,800 క్యూసెక్కులకు కుదించి రాయలసీమ రైతుల నోట్లో మట్టి కొట్టారు.
ఆల్మట్టి, అప్పర్ భద్రలపై ఎందుకు మౌనం?
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రోజుకోసారి జపం చేసే చంద్రబాబు.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్రకు 25 టీఎంసీల నీరు ఆగిపోయి ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటుంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? పులిచింతల పరివాహక ప్రాంత రైతుల గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చంద్రబాబుకు నీళ్ల మీద, రైతుల మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు.
24న 'పోతిరెడ్డిపాడు' వద్ద మహా పోరాటం..
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని శైలజనాథ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు గ్రేటర్ రాయలసీమ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతు విభాగాలతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడును పూర్తి సామర్థ్యంతో, హంద్రీ-నీవాను పూర్తి సామర్థ్యంతో నడిపించి రాయలసీమ ప్రాజెక్టులను నింపాలని.. 6,300 క్యూసెక్కుల హంద్రీ-నీవా సామర్థ్యాన్ని తగ్గించి 3,800 క్యూసెక్కులకు పరిమితం చేయడం ఎందుకని నిలదీశారు.
దీనిపై రైతులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. తక్షణమే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా పూర్తి సామర్థ్యంతో 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శైలజానాధ్ హెచ్చరించారు.


