స్పష్టం చేసిన జూనియర్ వైద్యులు
12వ రోజుకు చేరిన జూడాల సమ్మె.. నిలిచిపోయిన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు
అయినా స్పందన లేని ప్రభుత్వం.. మండిపడ్డ డాక్టర్లు
8 నెలలుగా కోరుతున్నా తమ సమస్యలపై స్పందించలేదని మండిపాటు
చర్చలకు పిలవకుండా తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తోందని ఆగ్రహం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. 8 నెలలుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించక పోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచి్చందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె 12వ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు అన్ని బోధనాస్పత్రుల్లో జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు.
వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. జూడాల సమ్మెతో పలు జిల్లాల్లో శస్త్రచికిత్సలు కూడా నిలిచిపోయినట్టు తెలిసింది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా, అధికారులతో తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తుండటంపై జూనియర్ వైద్యులు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏపీ జూనియర్ వైద్యుల (ఏపీ జూడా) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్, జనరల్ సెక్రటరీలు డాక్టర్ రవితేజ నాయక్, డాక్టర్ దినకర్ సాయిశ్రీనివాస్, డాక్టర్ లుక్‌మన్ అలీ, ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవ్‌సాయి నాయుడు, డాక్టర్ జోగి కమల్, డాక్టర్ కర్ణపు రమేష్ తో పాటు డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ ఎస్‌కే అమీర్ మీడియాతో మాట్లాడారు.
12 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా అధికారులతో తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైపెండ్ 30 శాతం పెంచాలని, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచవద్దని, పోస్టుల భర్తీలో ఎండీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టైపెండ్ పెంచిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలో వాస్తవం లేదన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరిగిందని లెక్కలతో సహా వివరించారు.
స్టైపెండ్ కనీసం 20 శాతం పెంచాలని కోరినా వైద్య శాఖ మంత్రి స్పందించలేదని మండిపడ్డారు. జూనియర్ డాక్టర్లు కూడా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ద్వారా ఆదాయం తెస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో జూడాలకు తమకంటే దాదాపు 15 శాతం స్టైపెండ్ అధికంగా వస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేరుగా తమతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంత వరకూ సమ్మెకొనసాగుతుందని స్పష్టం చేశారు.


