సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచి్చన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహం
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి హాజరైన జగన్
జల విహార్ వరకు దారి పొడవునా అభిమానుల ఘనస్వాగతం
భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు.. జై జగన్ నినాదాలు
చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగిన జననేత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. నగరంలోని జల విహార్ గ్రాండ్ లాన్స్‌లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను ఆశీర్వదించి, వారికి హృదయ పూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడున్న వారందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ కాన్వాయి జల విహార్ గేటులోకి ప్రవేశించగానే పెద్ద ఎత్తున అభిమానులు జై జగన్.. అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.

ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వైఎస్ జగన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సమయంలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం మార్మోగింది. తమ అభిమాన నాయకుడితో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు పలువురు పోటీపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపు చేయడం కాస్త కష్టసాధ్యంగా మారింది.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. కరచాలనం చేసుకుంటూ.. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాన్వాయ్ వెంట ద్విచక్ర వాహనాలపై యువత దారి పొడవునా జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ రాక సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వైఎస్ జగన్‌తో పాటు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో రూపొందించిన కటౌట్లు కనిపించాయి.

‘ధీరుడు వైఎస్ జగన్‌కు స్వాగతం’.. ‘వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది’ అనే క్యాప్షన్‌తో ఏర్పాటైన కటౌట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. కాగా, వివాహ వేడుకలో వైఎస్సార్‌సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, రోజా, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, విడదల రజిని, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌లతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.


