ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వని చంద్రబాబు
సామాజిక సమీకరణ వల్ల ఇవ్వలేకపోయానని బుజ్జగింపు
వర్మ, దేవినేని ఉమా, వంగవీటి రాధా, శ్రీనివాసరెడ్డి వంటి వారికీ నిరాశే
ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని చెప్పి రామయ్యను ఎలా ఎమ్మెల్సీ చేస్తారని ఆగ్రహం
సాక్షి, అమరావతి: పొత్తులో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు చంద్రబాబు మరోసారి మొండిచేయి చూపడం చర్చనీయాంశమైంది. ఇటీవల గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను వర్ల రామయ్య, రమాదేవికి ఇచ్చారు. దీంతో ఆ పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వర్మతో పాటు మిగిలిన సీనియర్ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు.
తొలి ఎమ్మెల్సీ ఇస్తానని.. రెండేళ్లయినా పట్టించుకోని వైనం
పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకొన్నందుకు ప్రభుత్వం ఏర్పడగానే తొలి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని వర్మకు చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచార సమయంలోనే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ని విస్మరించారు. రెండేళ్లయినా, పలుమార్లు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం వచ్చినా చంద్రబాబు ఆయన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. తన నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం ఉండకూడదని పవన్ కళ్యాణ్ కోరడం వల్లే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలేదని తెలుస్తోంది. అయితే పైకి మాత్రం వర్మను పిలిచి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రతిసారీ చెబుతున్నారు. తీరా వాటిని భర్తీ చేసేటప్పుడు మాత్రం పట్టించుకోవడంలేదు.
ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తొలగించేశారు. ఆ సమయంలో కూడా ఎమ్మెల్సీని చేస్తామని, పార్టీ పదవి ఏముందని బుజ్జగించారు. తీరా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న వర్మను రెండు రోజుల క్రితం చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని మరోమారు బుజ్జగించారు. సామాజిక సమీకరణల వల్ల ఒక ఎస్సీ, ఒక బీసీకి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని, ఈసారి సర్దుకుపోవాలని, మరోసారి చూద్దామని చెప్పి పంపించేశారు. దీంతో ఆయనకు పదవి మున్ముందు కూడా డౌటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్లకు భంగపాటే
మరోవైపు ఈసారైనా తమకు కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఎదురుచూసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు నిరాశ తప్పలేదు. మైలవరం సీటు వదులుకున్నాను కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని దేవినేని ఉమా ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఆయన పేరును అసలు పరిగణనలోకే తీసుకోలేదని సమాచారం. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు సమాచారం. వంగవీటి రాధాకృష్ణను ఎమ్మెల్సీని చేస్తామని స్వయంగా లోకేశ్ హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆయన ఊసే మర్చిపోయారు.
ఈసారి కచ్చితంగా తనకు అవకాశం వస్తుందని భావించి, భంగపడ్డ రాధాకృష్ణ తన భవిష్యత్తు ఏమిటనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఎదురు చూసినా నిరాశ తప్పలేదు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి, చంద్రబాబు పక్కనే ఉండే టీడీ జనార్థన్ వంటి నేతలకూ భంగపాటు తప్పలేదు.
ఇప్పుడు భర్తీ చేసిన రెండు పదవుల్లో ఒకటి వర్ల రామయ్యకు ఇవ్వడంపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని చెప్పి రామయ్యకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా పామర్రు ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. తమ సీనియారిటీ, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా అవమానిస్తున్నారని పలువురు నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు.


