ఇథనాల్‌ ఫ్యాక్టరీలో కూలిన భారీ ట్యాంకు | Huge tank collapses at ethanol factory | Sakshi
Sakshi News home page

ఇథనాల్‌ ఫ్యాక్టరీలో కూలిన భారీ ట్యాంకు

Aug 22 2026 5:28 AM | Updated on Aug 22 2026 5:28 AM

Huge tank collapses at ethanol factory

జూనియర్‌ ఇంజినీర్‌ మృతి.. ఐదుగురు కార్మికులకు గాయాలు 

శిథిలాల కింద మరికొందరు? 

ఈటీపీ ట్యాంకుకు మరమ్మతులు చేస్తుండగా ఘటన 

ప్రకాశం జిల్లాలోని శర్వాణీ బయో ఫ్యూయల్‌ ఫ్యాక్టరీలో ఘటన 

మేదరమెట్ల: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామం వద్ద ఇథనాల్‌ తయారు చేసే శర్వాణీ బయో ఫ్యూయల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలో శుక్రవారం ఈటీపీ (ఎథిలియోటెడరీ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు) కూలింది. ఈ ఘటనలో జూనియర్‌ ఇంజినీర్‌ ఒకరు మృతిచెందగా, ఒడిశాకు చెందిన ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద ఉ­న్నట్లు భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో 240 మంది పైగా పనిచేస్తుంటారు. జూనియర్‌ ఇంజినీర్‌ అరవింద్‌ (27), ఒడిశాకు చెందిన రవీందర్, భగవాన్, రోహిత్‌ కుమార్, ముఖేశ్‌ కుమార్, తిరుపతికి చెందిన దక్షిణామూర్తితో పాటు మరికొందరు శుక్రవారం మరమ్మతులకు గురైన ఈటీపీ ట్యాంకును బాగు చేస్తున్నట్లు సమాచారం. 

సాయంత్రం సమయంలో 10 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన భారీ ఈటీపీ ట్యాంకు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూలిపోయి, దానిలోని నీరంతా బయటకు వచి్చంది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మిగతా కార్మికులు బయటకు పరుగులు తీశారు. గాయపడిన ఐదుగురిని వెంటనే బయటకు తీసి, అద్దంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పొక్లెయిన్‌తో శిథిలాలను తొలగిస్తుండగా జూని­యర్‌ ఇంజినీర్‌ అరవింద్‌ (27) మృతదేహం బయటపడింది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు భావిస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఫ్యాక్టరీ హెడ్‌ ఆఫీసు నుంచి కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి, మరికొందరు వచ్చారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. 

హాజరు పట్టీ లేదా? 
ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు ఏయే యూనిట్లలో పని చేస్తున్నారో హాజరు పట్టీలో సరిగా లేదని ఫ్యాక్టరీ వర్గాలే చెబుతున్నాయి. ఇక్కడ నిబంధనలు, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కంపెనీ హెచ్‌ఆర్‌ మురళిని వివరణ కోరగా.. ఒక సారి ఐదుగురే అని, మరోసారి ఆరుగురని, ఇంకోసారి ఏడుగురని పొంతన లేని సమాధానమిచ్చారు. చివరకు తమకే స్పష్టత లేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement