షిప్.. షిప్.. హుర్రే! | Hindustan Shipyard is ushering in a new shipping revolution | Sakshi
Sakshi News home page

షిప్.. షిప్.. హుర్రే!

Aug 22 2026 5:44 AM | Updated on Aug 22 2026 5:44 AM

Hindustan Shipyard is ushering in a new shipping revolution

సత్తా చాటిన విశాఖ షిప్‌యార్డ్‌

అత్యాధునిక సాంకేతికత, కట్టుదిట్టమైన భద్రతతో ప్రక్రియ పూర్తి

తూర్పు తీరంలో నౌకాదళ ఫ్లీట్‌ సన్నద్ధతకు మరింత బలం

240 మీటర్ల పొడవు.. 80 వేల టన్నుల సామర్థ్యంతో సేవలు

సరికొత్త షిప్పింగ్‌ విప్లవానికి తెరతీస్తున్న హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ 

డ్రై డాక్‌లోకి భారీ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’

తొలిసారిగా 175 మీటర్ల ల్యాండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డాకింగ్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) తన సుదీర్ఘ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. భారత నౌకాదళానికి చెందిన అత్యంత భారీ యుద్ధ నౌకల్లో ఒకటైన.. ఏకైక ల్యాండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డాక్‌ ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ని షిప్‌యార్డు విజయవంతంగా డ్రై డాక్‌ (ఓడల నిర్వహణ, మరమ్మతు ప్రక్రియ)లోకి తీసుకుంది. హెచ్‌ఎస్‌ఎల్‌ చరిత్రలో ఇంతటి భారీ సైనిక ప్లాట్‌ఫామ్‌ను డాకింగ్‌ చేయడం ఇదే తొలిసారి. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా పూర్తిచేసి, రక్షణరంగ నౌకల మరమ్మతుల్లో తన సత్తాను మరోసారి చాటుకుంది.

కొత్త చరిత్ర లిఖిస్తూ..
దేశీయ నౌకల తయారీపై దృష్టి సారిస్తూ.. అత్యుత్తమ సేవలందించేందుకు మినీరత్నగా ఆవిర్భవించిన తర్వాత హిందూస్థాన్‌ షిప్‌యార్డు వరుస లాభాలతో దూసుకుపోతూ కొత్త చరిత్ర లిఖిస్తోంది. ఓ వైపు దేశీయ ఆర్డర్లతోపాటు అంతర్జాతీయ నౌకల మరమ్మతుల్ని దక్కించుకుంటూ చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తోంది. ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌(ఎఫ్‌ఎస్‌ఎస్‌) నిర్మాణంతోపాటు 45 మిలియన్‌ టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్‌ సామర్థ్యమున్న నౌకల్ని తయారుచేస్తోంది. 

అక్కడికే పరిమితం కాకుండా భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, కార్గో షిప్స్, పోర్టు గ్రీన్‌ టగ్‌లు, కోస్ట్‌గార్డ్‌ వెసల్స్, జలాంతర్గాముల రీఫిట్, మరమ్మతుల పనులతో షిప్‌యార్డు సత్తా చాటుతోంది. విదేశీ నౌకలకు మరమ్మతు చేయడం ద్వారా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆకర్షించిన షిప్‌యార్డు ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యం దిశగా అడుగులు వేయాలని ఉవ్విళ్లూరుతూ భారీ నౌకల్ని కూడా డ్రైడాక్‌లోకి తీసుకొస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది.

నౌకాదళానికి వ్యూహాత్మక లబ్ధి
జలాశ్వ యుద్ధనౌక డాకింగ్‌ విజయవంతం కావడం తూర్పు నౌకాదళానికి వ్యూహా­త్మకంగా ఎంతో కీలకం. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌కి తమ భారీ ప్లాట్‌ఫామ్‌ల మరమ్మతుల కోసం ఇకపై ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. తూర్పు తీరంలోనే అత్యంత నమ్మకమైన నౌకల మరమ్మతు కేంద్రం అందుబాటులో ఉండటం వల్ల నౌకల టర్న్‌ అరౌండ్‌ సమయం తగ్గి ఫ్లీట్‌ ఎప్పటికప్పుడు ఆపరేషన్లకు సిద్ధంగా ఉంటుంది. సముద్ర జలాల్లో చైనా వంటి దేశాల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాదళం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండటానికి షిప్‌యార్డు అందిస్తున్న అత్యాధునిక సాంకేతిక సేవలు వెన్నెముకలా నిలుస్తున్నాయి.

80 వేల టన్నుల సామర్థ్యంతో..
విశాఖలోని షిప్‌యార్డ్‌ డ్రైడాక్‌ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇది 240 మీటర్ల పొడవు, 53 మీటర్ల వెడల్పు, 8.5 మీటర్ల లోతు (డ్రాఫ్ట్‌)తో నిర్మితమైంది. ఒకేసారి 70,000 నుంచి  80,000 డెడ్‌వెయిట్‌ టన్నేజ్‌ సామర్థ్యం గల భారీ నౌకలకు మరమ్మతులు చేయగల సత్తా దీని సొంతం. గతంలో 200 మీటర్లకు పైగా పొడవున్న కమర్షియల్‌ పానామాక్స్‌ బల్క్‌ క్యారియర్లు, క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్లకు విజయవంతంగా మరమ్మతులు నిర్వహించారు. ఇప్పుడు జలాశ్వ రాకతో భవిష్యత్‌లో నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు లేదా అంతకంటే సంక్లిష్టమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు షిప్‌యార్డ్‌  సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

అత్యద్భుత సమన్వయంతో..
ఐఎన్‌ఎస్‌ జలాశ్వ సాధారణ యుద్ధనౌక కాదు. సుమారు 175 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌకను డ్రైడాక్‌లోకి తీసుకురావడం ఇంజినీరింగ్‌ పరంగా షిప్‌యార్డుకి పెద్ద సవాల్‌గా మారింది. దీనికోసం ముందుగానే హెచ్‌ఎస్‌ఎల్‌ బృందాలు నిశితమైన డాకింగ్‌ అనాలసిస్‌ చేపట్టి.. నౌక బరువు, ఆకృతికి అనుగుణంగా కచ్చితమైన డాక్‌బెడ్‌ని సిద్ధం చేశారు. 

అన్ని విభాగాల సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో భద్రతా ప్రమాణాల్లో ఏమాత్రం రాజీ పడకుండా ఈ భారీ నౌకను సురక్షితంగా డాక్‌లోకి విజయవంతంగా చేర్చారు. భారత నావికాదళంలో బలగాలను, ట్యాంకర్లను ఒకేసారి తరలించే సామర్థ్యం ఉన్న అతిపెద్ద నౌక జలాశ్వ. ఇది సుమారు 1,000 మంది సైనికులతోపాటు కంబాట్‌ వెహికల్స్, హెలి­కాప్టర్లను మోసుకెళ్లగలదు. గతంలో ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ తదితర విపత్తు సహాయక చర్యల్లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ నౌకకు హెచ్‌ఎస్‌ఎల్‌ ఆధ్వర్యంలో సమగ్ర మరమ్మతులు, ఆధునికీకరణ పనులు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement