భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా? | Earliest Evidence of Life Indian Geologists Unearth 3.5 Billion Year-Old Microbial Fossils in Jharkhand | Sakshi
Sakshi News home page

భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?

Aug 22 2026 9:17 AM | Updated on Aug 22 2026 9:55 AM

Earliest Evidence of Life Indian Geologists Unearth 3.5 Billion Year-Old Microbial Fossils in Jharkhand

న్యూఢిల్లీ: భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5 బిలియన్) ఏళ్ల నాటి సూక్ష్మజీవుల అవశేషాలు (మైక్రోబియల్ మ్యాట్స్) లభ్యమైనట్లు పరిశోధకులు వెల్లడించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ)శాస్త్రవేత్త త్రిస్రోతా చౌధురి నేతృత్వంలోని బృందం, యూరప్ అమెరికా పరిశోధకులతో కలిసి నిర్వహించిన ఈ అధ్యయనం ప్రతిష్టాత్మక ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైంది.

జంషెడ్‌పుర్‌ సమీపంలోని భితర్‌దారి ప్రాంతంలో ఉన్న పురాతన రాళ్లపై నలుపు-తెలుపు చారల రూపంలో ఈ శిలాజాలు కనిపించాయి. జీవసంబంధ పదార్థంతో పాటు కాలగణనకు ఉపయోగపడే ‘జిర్కాన్’ స్పటికాలు ఒకే శిలలో కలిసి ఉండటం అత్యంత అరుదైన విషయమని, దీనివల్ల రాతి వయసును, జీవ ఉనికిని నేరుగా నిర్ధారించడం సాధ్యమైందని త్రిస్రోతా చౌధురి తెలిపారు. శిలలోని కార్బన్ సహజమైనదా లేక అగ్నిపర్వతాల వంటి ప్రక్రియల ద్వారా చేరిందా అని తేల్చేందుకు ‘రామన్ స్పెక్ట్రోస్కోపీ’ పద్ధతిని ఉపయోగించి పరిశీలించారు.

ఈ కార్బన్ 324 నుంచి 369 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే ఎదుర్కొందని, ఇది అసలు రాతికి చెందిన స్వదేశీ పదార్థమేనని నిర్ధారించారు. అలాగే ఎనిమిది జిర్కాన్ స్పటికాలలోని యురేనియం-లెడ్ నిష్పత్తిని విశ్లేషించగా, వీటి వయసు 350 కోట్ల సంవత్సరాలుగా తేలింది. 3.5 బిలియన్ ఏళ్ల క్రితం తీవ్రమైన రసాయన పరిస్థితులు, చురుకైన అగ్నిపర్వతాలు, ఇనుము, సిలికా అధికంగా ఉన్న సముద్ర వాతావరణంలోనూ ఆదిమ సూక్ష్మజీవులు జీవించగలిగాయని, కార్బన్ డై ఆక్సైడ్‌ను సేంద్రియ పదార్థంగా మార్చే అధునాతన విధానాలను అప్పట్లోనే వినియోగించాయని ఈ పరిశోధన రుజువు చేస్తోంది.

ఇది  కూడా చదవండి: ‘సంభాల్‌ మాస్టర్‌మైండ్‌’కు ఉచ్చు.. రెడ్ కార్నర్ నోటీస్ జారీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement