సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని యామిని ఆత్మహత్య | Software Employee Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని యామిని ఆత్మహత్య

Aug 22 2026 8:27 AM | Updated on Aug 22 2026 8:47 AM

Software Employee Ends Life In Hyderabad

చిలకలూరిపేటటౌన్‌:  ఉన్నత చదువులు పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడింది. కుటుంబానికి అండగా నిలవాలనే ఆశలు.. జీవితంలో మరెన్నో మెట్లు ఎక్కాలనే కలలు. కానీ అంతలోనే ఆ కుటుంబాన్ని తీరని విషాదం చుట్టుముట్టింది. చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన యామిని(24) హైదరాబాద్‌లో మృతి చెందడం తల్లిదండ్రులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.  

ఏం జరిగిందో..? 
చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన సుబ్బారావు, లక్ష్మి దంపతుల కుమార్తె యామిని హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో ఓ ప్రైవేట్‌ లేడీస్‌ హాస్టల్‌లో తోటి యువతులతో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంది. గురువారం సాయంత్రం తోటి స్నేహితురాళ్లు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ యామినిని కూడా తమతో రావాలని కోరినట్లు తెలిసింది. ఆమె రానని చెప్పడంతో వారు బయటకు వెళ్లారు.

కొంతసేపటి తర్వాత తిరిగి హాస్టల్‌కు చేరుకున్న వారు గదిలో నుంచి స్పందన లేకపోవడంతో వార్డెన్‌కు సమాచారం అందించారు. అనంతరం గదిని తెరిచి చూడగా యామిని మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి ఖచ్చితమైన కారణం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో వివరాలు పరిశీలిస్తున్నారు. 

శోక సంద్రంలో తల్లిదండ్రులు  
గతంలో పట్టణంలోని పండరీపురంలో నివాసం ఉన్న యామిని కుటుంబం ప్రస్తుతం మండలంలోని కావూరులో ఉంటోంది. కుటుంబ పోషణ కోసం తండ్రి హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కష్టపడి పెంచిన కూతురు చదువుకుని ఉద్యోగంలో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తమ బిడ్డ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

ఆ ఆశల మధ్యే యామిని మృతి చెందడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. కళ్లెదుటే పెరిగిన కూతురు ఇక తిరిగిరాదన్న నిజాన్ని జీర్ణించుకోలేక  వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి ఆవేదన కుటుంబ సభ్యులు, బంధువులను కలచివేస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement