సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాడిపత్రి అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్‌లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి అంటూ నిప్పులు చెరిగారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గోవా లిక్కర్ అక్రమ సరఫరాపై వైఎస్సార్‌సీపీ నేతలతో ఓ కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్‌లతో ఓ కమిటీ వేయండి. తాడిపత్రిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలి. తాడిపత్రి పోలీసు స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు?. తాడిపత్రిలోని పోలీసు స్టేషన్‌లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టండి.
అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు పెడితే సరిపోతుంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిని గ్యాంగ్ స్టర్‌లా తయారు చేశారు. 24 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అంతం చేస్తామని అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. దీనిపై సాక్షాత్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో వివాహ వేడుకలకు హాజరుకావాలంటే జేసీ అనుమతి కావాలా?. తాడిపత్రిలో పోలీసుల ప్రేక్షక పాత్ర దేనికి సంకేతం?.
ఇది కూడా చదవండి: వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్లీ అప్పు..
గోవా లిక్కర్ కేసులో జేసీ తయారు చేసిన మార్ఫింగ్ ఫొటోలపై చర్యలు తీసుకోరా?. జేసీ అరాచకాలపై కలెక్టర్, ఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీకి వత్తాసు పలికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. జేసీపై ఉన్న కేసులన్నీ జేసీ ట్రావెల్స్ చీటింగ్, క్రిమినల్ కేసులే. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్క్రాప్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన ఘనుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు.


