సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కుటుంబం చుట్టూ నెలకొన్న వివాదం మరింత వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తిని ఒక్కసారిగా బయటపెట్టేశాయి. ఈ క్రమంలో కొండా దంపతుల స్పందనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ అలియాస్ చిట్టక్క చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే తానేనంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్, ఆపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పార్టీ నేతలపై ఆమె చేసిన విమర్శలపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూతురి వ్యాఖ్యలను ఖండించకుండా.. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ ఇచ్చిన నామమాత్రపు వివరణపైనా భగ్గుమన్నారు. ప్రతిపక్షాలకు సహకరించేలా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. కొండా ఫ్యామిలీ తక్షణమే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని.. లేని పక్షంలో అధిష్టానమే క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద గెంటేయాలని డిమాండ్ చేశారు.
చర్యలపై ఉత్కంఠ
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. వివాదం ముదిరుతున్నా.. ఇప్పటివరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది. మంత్రులు సైతం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అమెరికా పర్యటన రద్దుతో సీఎం రేవంత్ రేపు తిరిగి హైదరాబాద్ రానున్నారు. వచ్చిరాగానే అత్యవసరంగా ఆయన ఈ అంశంపై చర్చలు జరుపుతారని సమాచారం. ఈ క్రమంలో హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా? లేదంటే చర్యలకు దిగుతుందా? అనే అంశం ఉత్కంఠగా మారింది.
టికెట్ దక్కలేదనే అలా..
ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలపై సుస్మిత కాస్త టోన్ మార్చింది. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే తాను ముఖ్యమంత్రిపై విమర్శలు చేశానని పేర్కొంది. వ్యక్తిగత అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నేడు కొండా మురళి స్పందించే అవకాశం
ఈ వివాదంపై కొండా కుటుంబం వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు మౌనం పాటించిన కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు నేడు(శనివారం) మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన స్పందనతో ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా.. వరంగల్ కాంగ్రెస్‌లో మొదలైన ఈ అంతర్గత కలకలం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అధిష్ఠానం నిర్ణయం, కొండా కుటుంబ స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
ఇదీ చదవండి: నా టార్గెట్ ఆయనే.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్య


