మేమిక్కడే.. మా ఓటూ ఇక్కడేనన్న ప్రముఖులు
‘సర్’ ఎన్యూమరేషన్ పత్రాల్లో వెల్లడి
హైదరాబాద్ జిల్లాలో 2,081 మంది వీఐపీలు
సాక్షి, హైదరాబాద్: సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఉత్తరాది రాష్ట్రంలో.. ఇళ్లు, నివాసాలు మాత్రం హైదరాబాద్ నగరంలో! మూలాలు అక్కడున్నా.. జీవితం మాత్రం ఇక్కడే! సుదీర్ఘకాలంగా నగరంలో ఉంటూ, ఇక్కడే ఎదిగిన వీఐపీల్లో చాలామంది ఓటు విషయంలోనూ నగరానికే ప్రాధాన్యమిచ్చారు. ‘ఇక్కడే ఉంటాం.. ఇక్కడే ఓటు’ అన్నట్టు నగరంలోనే ఓటరుగా ఉండేందుకు సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. ఈ వివరాలను పరిశీలించగా.. ఆసక్తికర అంశం వెల్లడైంది.
సినీ తారలు, దర్శకులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీస్ ఉన్నతాధికారులు.. ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరి నుంచీ ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల యంత్రాంగం వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,081 మంది వీఐపీలను గుర్తించింది.
సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు, సెలబ్రిటీలు, లెజెండ్స్ ఎక్కువ మంది నివసిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి వారు అధికంగా 457 మంది ఉన్నారు. కాగా.. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటోన్మెంట్‌లో ఎక్కువమంది వీఐపీలను అధికారులు గుర్తించారు. తర్వాతి స్థానాల్లో ఖైరతాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్‌లున్నాయి.
ఎన్నికల నాటికి ఎక్కడో?
ప్రస్తుతానికి వీరంతా నగరంలోనే ఓటర్లుగా ఉండగా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇతర ప్రాంతాలకు మారొచ్చు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలప్పుడు ఎక్కడ ఉంటారన్నదే మరో ఆసక్తికర అంశంగా మిగిలింది.



