హైదరాబాద్‌ వాసులకు నిద్ర కరువు.. కారణం ఇవే! | Urban residents lose 198 hours of sleep every year | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వాసులకు నిద్ర కరువు.. కారణం ఇవే!

Aug 22 2026 9:33 AM | Updated on Aug 22 2026 10:06 AM

Urban residents lose 198 hours of sleep every year

కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది.. అన్నచందంగా మనిషి జీవితంలో నిద్రకు ఎంతో ప్రాముఖ్యముంది. వ్యక్తిగత సమస్యలు.. మానసిక రుగ్మతలు.. అనారోగ్యం.. సాధారణంగా ఇలాంటి వాటితో నిద్ర కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కానీ.. ప్రస్తుతం మెట్రో నగరవాసుల్ని పట్టిపీడిస్తూ నిద్రను దూరం చేస్తున్న సమస్యలు మరో రెండు ఉన్నాయి. అవేమిటంటే.. పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్, రాత్రి వేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్‌ విషయాన్నే తీసుకుంటే ఈ రెండు కారణాలతో ఏటా 198 గంటల నిద్రను నగరజీవులు కోల్పోతున్నారు. తాజాగా విడుదలైన టామ్‌టామ్‌ ట్రాఫిక్‌ ఇండెక్స్, అమెరికాకు చెందిన క్‌లైమేట్‌ సెంట్రల్‌ సంస్థల సర్వేలు ఈ విషయాలను వెల్లడించాయి.   

హైదరాబాద్‌: నగరంలోని రహదారులపై మిగిలిన సమయాల్లో కంటే ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పీక్‌ అవర్స్‌ అని పిలుస్తుంటారు. ఉదయం కంటే సాయంత్రం వేళ రద్దీ ఎక్కువగా ఉంటోందని టామ్‌టామ్‌ నివేదిక తేల్చింది. ఆ సమయంలో ఉండే ట్రాఫిక్‌ రద్దీ కారణంగా నగర వాసి ఏటా సుమారు 123 గంటలు కోల్పోతున్నాడు. అంటే.. దాదాపు ఐదు రోజులు అదనంగా ట్రాఫిక్‌లోనే గడిపేస్తున్నాడు. టామ్‌టామ్‌ నివేదిక ప్రకారం నగరంలో ట్రాఫిక్‌ రద్దీ స్థాయి 55.5 శాతంగా తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ స్లో మూవింగ్‌ ట్రాఫిక్‌ ఇండెక్స్‌ పేరుతో ప్రతి ఏడాదీ నివేదిక విడుదల చేస్తోంది. ఆసియా, యూరప్, సౌత్‌ అమెరికా, నార్త్‌ అమెరికా, ఆ్రస్టేలియా ఖండాల్లోని 62 దేశాల్లో 500 నగరాల్లో టామ్‌ టామ్‌ సంస్థ సర్వే చేసింది.

సాయంత్రం దయనీయం.. 
సాధారణ సమయంలో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి సగటున 32.37 నిమిషాలు పడుతోంది. అదే సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ సమయంలో వాహనాల సగటు వేగం గణనీయంగా తగ్గిపోయి 10 కిమీ దూరం ప్రయాణించడానికి సగటున 39.5 నిమిషాలు పడుతోంది. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటింది. అదే సమయంలో ప్రజా రవాణాకు ప్రాధాన్యం లభించట్లేదు. నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 25–30 కిమీ ఉండాలి. కానీ.. సగటు వేగం కేవలం 15 కి.మీ పరిమితమవుతోంది. సాయంత్రం రద్దీ వేళల్లో ఇది గంటకు 10 కి.మీలకు పడిపోతోంది. ఇలా ప్రయాణ సమయం పెరిగి... సగటు జీవి రాత్రి వేళల్లో నిద్రపోయే సమయం తగ్గిపోతోంది.  

ఇంటికి చేరాకా నరకమే.. 
ట్రాఫిక్‌ సుడిగుండాన్ని దాటుకుని ఇంటికి చేరిన నగరవాసికీ నిద్ర పట్టట్లేదు.  వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కుతున్న రాత్రులతో ఏటా 75 గంటల నిద్రకు దూరం అవ్వాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన క్లైమేట్‌ సెంట్రల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,338 నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ముఖ్యంగా కాంక్రీట్‌ నిర్మాణాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని నిల్వ చేసుకుని.. సూర్యాస్తమయం తర్వాత కూడా ఆ వేడి త్వరగా తగ్గకుండా చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ అంశంలో హైదరాబాద్‌ కంటే ఎక్కువగా వరంగల్‌లో 82 గంటల నిద్రను కోల్పోతుండటం గమనార్హం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement