ప్రధాని మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’సందర్భంగా ప్రధాని మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని పెద్ద కలలు కంటూ, మరింత పెద్ద ఆవిష్కరణలు చేస్తూ, సరికొత్త సరిహద్దులకు విస్తరిద్దామని పిలుపునిచ్చారు. 2023 ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దించిన చంద్రయాన్–3 మిషన్‌ను స్మరించుకోవడానికి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా 20 అంతరిక్ష రంగ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, సీఈఓలతో ప్రధాని మోదీ శుక్రవారం నాటి భేటీ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదలచేసింది. ‘‘విస్తారమైన మన ప్రతిభావంతుల సమూహం, రిస్క్ తీసుకునే సామర్థ్యం మన బలం. వీటితో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోగలదు. ప్రపంచం ఇప్పుడు భారతీయ స్టార్టప్‌ల వైపు ఆసక్తి చూస్తోంది. ఎప్పుడైతే ఒక పురోగతి జరుగుతుందో, ప్రజల దృష్టి వెంటనే అటువైపు మళ్లుతుంది. మన అంతరిక్ష పరిశ్రమలోకి ప్రైవేట్ సంస్థలకు ద్వారాలు తెరిచిన తర్వాత సానుకూల ధోరణి కనిపించింది’’అని అన్నారు.


