రక్షానుబంధం | Strengthening the bonds of sibling love | Sakshi
Sakshi News home page

రక్షానుబంధం

Aug 28 2026 4:21 AM | Updated on Aug 28 2026 4:21 AM

Strengthening the bonds of sibling love

ఆధ్యాత్మికంగానూ, సంప్రదాయకంగానూ చూస్తే శ్రావణ  పౌమికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అయితే అందరూ అవేమీ అంతగా పట్టించుకోరు. అందరికీ గుర్తొచ్చేది రాఖీ  పౌమి అనే. దీనినే రక్షా బంధన్‌ లేదా శ్రావణ పూర్ణిమ అని పిలుస్తారు. ఇది కేవలం సోదరుల చేతికి సోదరి ఒక దారం కట్టే వేడుక మాత్రమే కాదు; తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు, రక్షణకు, పరస్పర బాధ్యతకు తీపి గుర్తు.

 ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల క్షేమాన్ని కోరుకుంటూ రాఖీ కడితే, సోదరులు తమ సోదరీ మణులకు అన్నింటా అండగా ఉంటామని బాస చేస్తారు. ఆఫీసులలోనూ, పని చేసే సంస్థలలోనూ... ఇళ్లలో పని చేసే వారు ఇంటి యజమానులను కూడా ‘మేం రాఖీ కట్టేందుకు మా పుట్టింటికి వెళ్లాలి, సెలవు కావాలి’ అని అడిగితే కాదనలేని కాజు. అలాగే ‘మా అక్క లేదా మా చెల్లి చేత రాఖీ కట్టించుకోవాలి నేను ఊరు వెళుతున్నా సారూ’ అంటే సరేనని తలూపి తీరవలసిన ఒక మంచి రీజను. ఇంతమందిని ఇన్ని విధాలుగా కట్టి పడేస్తున్న ఈ రాఖీ పండగ ఎలా మొదలయ్యిందో తెలుసుకుందాం, 

పౌరాణికంగా చూస్తే...
ఇది కేవలం సోదర వాత్సల్యానికే కాదు... భార్యాభర్తలు, భగవంతుడు–భక్తుడు, విశ్వశాంతి కోసం ఒకరికొకరు రక్షణ కల్పించుకునే పవిత్ర బంధానికి ప్రతీక అని కొన్ని కథల ద్వారా తెలుస్తోంది. ఆ పురాణ గాథలు ఇవే 

ద్రౌపది – శ్రీ కృష్ణుడి గాథ: ఒకానొక సందర్భంలో కృష్ణుడి కుడిచేతి వేలికి గాయమై రక్తం కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి వంటి వారు రక్తాన్ని ఆపడానికి వస్త్రాల కోసం వెతుకుతుంటారు. కానీ అక్కడ ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా, తను కట్టుకున్న పట్టుచీర కొంగును చింపి, కృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. దానికి కృష్ణుడు ఎంతో చలించిపోయి, ‘సమయం వచ్చినప్పుడు ఈ బంధానికి రుణం తీర్చుకుంటాను, నిన్ను ఎల్లవేళలా రక్షిస్తాను సోదరీ’ అని మాట ఇస్తాడు. ఆ తర్వాత కురుసభలో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ఒడిగట్టినప్పుడు, కృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. ద్రౌపది కట్టిన ఆ చీర ముక్కే మొదటి ‘రక్షాబంధనం’ గా నిలిచింది. 

లక్ష్మీదేవి – బలిచక్రవర్తి గాథ: రాక్షస రాజైన బలిచక్రవర్తి భక్తికి, దానగుణానికి మెచ్చిన విష్ణుమూర్తి, అతనికి ఒక వరం ఇస్తాడు. దానిప్రకారం విష్ణుమూర్తి వైకుంఠాన్ని విడిచి, బలిచక్రవర్తి కోటకే కాపలా దారుడిగా ఉండిపోతాడు. భర్త రప్పించుకోవడం కోసం నారద మహర్షి సూచన మేరకు లక్ష్మీదేవి ఒక పేదమహిళ రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్తుంది. శ్రావణ  పౌమి రోజున బలిచక్రవర్తి మణికట్టుకు రక్షాసూత్రాన్ని కడుతుంది. బలిచక్రవర్తి సంతోషించి ‘నీకు ఏం కావాలో కోరుకో’ అనగానే, లక్ష్మీదేవి తన నిజరూపాన్ని చూపి, తన భర్త అయిన విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించమని కోరుతుంది. సోదరి లాంటి లక్ష్మీదేవి కోరికను బలిచక్రవర్తి కాదనలేక, విష్ణుమూర్తిని పంపిస్తాడు.

ఇంద్రాణి – ఇంద్రుడి గాథ
ఒకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. రాక్షసరాజు ‘బలి’ చేతిలో ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంద్రుడి  ప్రాణరక్షణ కోసం భయపడిన ఆయన భార్య శచీదేవి శ్రావణ  పౌమి నాడు పరమశివుడిని  ప్రార్థించి ఒక పవిత్రమైన రక్షా సూత్రానికి పూజ చేస్తుంది. ఆ మంత్రించిన సూత్రాన్ని ఇంద్రుడి కుడిచేతికి కడుతుంది. ఆ రక్షాసూత్రం ఇచ్చిన శక్తితో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించి, దేవలోకాన్ని కాపాడుకుంటాడు. అది కూడా రక్షాబంధనమే!

యమధర్మరాజు – యమునా దేవి గాథ
సూర్య భగవానుని సంతానమైన యముడు, యమున అన్నాచెల్లెళ్లు. యముడు తన విధుల్లో నిరంతరం అవిశ్రాంతంగా ఉండటం వల్ల చాలాకాలం పాటు సోదరి యమునను కలవలేకపోతాడు. ఒక శ్రావణ పౌమి రోజున యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి ఆహ్వానించి, నుదుట తిలకం దిద్ది, చేతికి రక్షణ సూత్రం కడుతుంది. ఎంతో రుచికరమైన వంటలు వడ్డించి ఆదరిస్తుంది. సోదరి ప్రేమకు ముగ్ధుడైన యముడు... ‘ఏ సోదరి అయితే శ్రావణ  పౌమి నాడు తన సోదరుడికి రాఖీ కట్టి, తిలకం దిద్దుతుందో, ఆ సోదరుడికి అపమృత్యు భయం (అకాల మరణం) లేకుండా దీర్ఘాయుష్షు లభిస్తుంది‘ అని వరం ఇస్తాడు. 
 

సాంప్రదాయికంగా ఇలా... 
సంప్రదాయం ప్రకారం ఉదయాన్నే తలస్నానం చేసి, దేవుని గదిలో దీపారాధన చేసిన తర్వాత ఒక ఇత్తడి లేదా వెండి పళ్లెంలో రాఖీలు (రక్షా సూత్రాలు) కుంకుమ, పసుపు (తిలకం కోసం) అక్షింతలు, నేతి దీపం లేదా కర్పూరం (హారతి ఇవ్వడానికి) తీపి పదార్థాలు (మిఠాయిలు) అమర్చుకోవాలి. 

సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం చేసి ఒక పీటపై కూర్చోవాలి. సోదరి తూర్పుముఖంగా నిలబడాలి. సోదరి తన కుడిచేతి ఉంగరపు వేలితో సోదరుడి నుదుట కుంకుమ తిలకం దిద్దాలి. ఆ తిలకంపై కొన్ని అక్షింతలు ఉంచాలి. తర్వాత సోదరుని కుడిచేతి మణికట్టుకు మూడు ముడులు వేస్తూ రాఖీని కట్టాలి. రాఖీ కట్టే సమయంలో ‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల మాచల‘ అనే పవిత్రమైన రక్షా మంత్రాన్ని పఠించడం ఎంతో శుభప్రదం:

రాఖీ కట్టిన తర్వాత, సోదరి నేతిదీపంతో సోదరుడికి దిష్టి తీస్తూ హారతి ఇవ్వాలి. అనంతరం సోదరుడి నోరు తీపి చేయాలి. సోదరుడు కూడా సోదరికి తీపి తినిపించాలి. సోదరి పెద్దదైతే సోదరుడు ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ సోదరి చిన్నదైతే సోదరుడి పాదాలకు నమస్కరించి దీవెనలు ΄÷ందాలి. సోదరుడు తన ప్రేమకు గుర్తుగా, తోచిన బహుమతిని లేదా దక్షిణను సోదరికి అందించి, జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇవ్వాలి.

 – డి.వి.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement