అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం! | Rakhi Celebration Turns Tragic As Vijayawada Woman Dies In Bus Accident, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం!

Aug 27 2026 11:36 AM | Updated on Aug 27 2026 12:17 PM

Vijayawada Suryapet Road Accident Sister Dies Before Raksha Bandhan

ఆంధ్రప్రదేశ్‌: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి మరో­సారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ప్రైవేటు బస్సుకు ఘోర రోడ్డు ప్రమా­దం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణి­స్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక­క్కడే దుర్మరణం పాలయ్యారు.

వీరిలో కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ ఉద్యోగం చేస్తు­న్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాషిణి ఉన్నారు. వీరు అజిత్‌సింగ్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్‌షాపు ఉంది.

దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్‌ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు.

ముందు వేరే బస్సుకు టికెట్‌ బుక్‌ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్‌మేట్స్‌ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు.

ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్‌లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్‌ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:  తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement