లక్ష్మీతేజ(ఫైల్)
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్‌కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్‌లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్‌ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్‌నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు.
మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు.
అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.
చదవండి: ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...


