మళ్లీ జల జగడం! | Water Issues flared up again between Andhra Pradesh, Telangana states | Sakshi
Sakshi News home page

మళ్లీ జల జగడం!

Aug 27 2026 6:14 AM | Updated on Aug 27 2026 6:14 AM

Water Issues flared up again between Andhra Pradesh, Telangana states

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడికాల్వ గేట్లు ఎత్తడానికి ఏపీ ప్రయత్నం 

కృష్ణాబోర్డు అనుమతి లేదని అడ్డుకున్న తెలంగాణ ఇంజనీర్లు

ప్రత్యామ్నాయంగా విద్యుదుత్పత్తి ద్వారా కుడికాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఏపీ 

దీంతో ఎడమ కాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన తెలంగాణ 

కానీ నీటి విడుదలపై ఉత్తర్వులు జారీ చేయని కృష్ణా బోర్డు 

ఆలోగా నీటి విడుదలకు ఏపీ ప్రయత్నాలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం

సాక్షి, హైదరాబాద్‌/నాగార్జునసాగర్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం రాజుకుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి నీటి విడుదల ఉత్తర్వులు పొందకుండానే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకోవడానికి ఏపీ ప్రయత్నించగా, తెలంగాణ అడ్డుకుంది. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ ఎడమ భాగం తెలంగాణ, కుడి భాగం ఏపీ భూభాగ పరిధిలోకి వస్తాయి. ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్లు బుధవారం ఉదయం 11.10 గంటల ప్రాంతంలో కుడి కాల్వ వద్దకు చేరుకొని గేట్లు ఎత్తడానికి ప్రయత్నించగా, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అడ్డుకున్నారు. తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదల చేసుకుంటున్నామని ఏపీ ఇంజనీర్లు వాదించగా, కృష్ణాబోర్డు అనుమతి లేకుండా గేట్లు ఎత్తడానికి వీలులేదని తెలంగాణ ఇంజనీర్లు అభ్యంతరం తెలిపారు. రెండు రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. 

తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ ఎస్‌ఈ మల్లికార్జున్, ఈఈ గోపినాథ్, ఏఈఈ విజయ్‌కుమార్‌ ఏపీ ఇంజనీర్లను అడ్డుకున్నారు. గేట్లను ఎత్తడం సాధ్యం కాకపోవడంతో ఏపీ ప్రత్యామ్నాయ మార్గంలో జలవిద్యుద్పుత్తి ప్రారంభించి కుడి ప్రధాన కాల్వకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ఏపీ జెన్‌కో యాజమాన్యంలోని 90 మెగావాట్ల (3గీ30)  సాగర్‌ కుడి ప్రధాన కాల్వ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరపాలంటే కనీసం 530 అడుగుల మేర నిల్వలు ఉండాలి. ప్రస్తుతం డ్యామ్‌లో 535 అడుగులకు నీటిమట్టం, 181 టీఎంసీలకు నిల్వలు చేరడంతో ఏపీ విద్యుదుత్పత్తి ప్రారంభించి కుడి ప్రధాన కాల్వ ద్వారా తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసుకుంది. దీంతో తెలంగాణ సైతం ఎడమ కాల్వ గేట్లు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది 
   
గతంలోనూ సాగర్‌పై వివాదం  
రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చేపట్టింది. 2023 నవంబర్‌ 29న అర్ధరాత్రి వేళ ఏపీ ప్రభుత్వం సాయుధ బలగాల సహాయంతో సాగర్‌ కుడి భాగాన్ని తమ అ«దీనంలోకి తీసుకోవడంతో అప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సాగర్‌ కుడివైపు భాగం వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాల పహారాను ఏర్పాటు చేసింది. డ్యామ్‌ కుడి భాగం వైపు మరమ్మతులు, నిర్వహణ పనులకు ఇంజనీర్లను కృష్ణాబోర్డు అనుమతి ఉంటేనే గతంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అనుమతించాయి. కృష్ణాబోర్డు అనుమతి తీసుకోకుండానే కుడిభాగం వైపు ఏపీ ఇంజనీర్లు ప్రవేశించి గేట్లను ఎత్తడానికి ప్రయత్నించారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. బుధవారం సాధారణ సెలవులు కావడంతో గురువారం ఈ అంశంపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ఇంజనీర్లు తెలిపారు.  

నీటి విడుదల ఉత్తర్వులు లేకుండానే.. 
ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులకు ఆశించిన మేరకు వరద రాలేదు. సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి జలాశయాల్లోని నిల్వలను కేవలం తాగునీటి అవసరాలకే వాడుకోవాలని ఇటీవల జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఏకభిప్రాయానికి వచ్చాయి. అక్టోబర్‌ 31 వరకు ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలను కేటాయించాలని ఏపీ కోరగా, 2027 జూన్‌ 31 వరకు ఉండే తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 112 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం లేకుండానే త్రిసభ్య సమావేశం ముగిసింది. శ్రీశైలం, సాగర్‌ పరిధిలో తెలంగాణలో రెండు కోట్ల జనాభా ఉందని, అక్టోబర్‌ 31వరకు తాగునీటి అవసరాల కోసం తమకూ 47 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది. ఏపీలో రెండు జలాశయాల పరిధిలో 76 లక్షల జనాభా ఉంటే 47 టీఎంసీలను ఎలా కోరుతారని ప్రశ్నించింది. చర్చల్లో ఏకభిప్రాయం సాధ్యం కాకపోవడంతో సెపె్టంబర్‌ 4న మళ్లీ సమావేశమై ఆనాటికి జలాశయాల్లో నిల్వలు పెరిగితే వాటి ఆధారంగా నీటి పంపకాలు జరుపుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో నీటి విడుదలపై కృష్ణాబోర్డు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈలోగా సాగర్‌ నుంచి ఏపీ నీటిని విడుదల చేసుకోవడం పట్ల తెలంగాణ తీవ్ర ఆక్షేపణ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement