ఆకలిని జయించారు.. అలలను దాటారు.. క్షేమంగా తిరిగొచ్చారు | Seven fishermen who went on the boat are safe | Sakshi
Sakshi News home page

క్షేమంగా తిరిగొచ్చారు

Aug 27 2026 5:17 AM | Updated on Aug 27 2026 5:17 AM

Seven fishermen who went on the boat are safe

ఈనెల 3న వేటకు వెళ్లిన కోనసీమ జిల్లా మత్స్యకారులు 

సమస్యలు తలెత్తడంతో గాలివాటున బోటులో సాహసం 

23 రోజులకు పశ్చిమ బెంగాల్‌లోని ధిగ తీరానికి చేరిక 

క్షేమంగా ఉన్నామని కుటుంబీకులకు సమాచారం

అల్లవరం/సాక్షి, అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల 3న సముద్రంలో చేపల వేటకు ఏడుగురు మత్స్యకారులతో వెళ్లిన బోటు..పశ్చిమ బెంగాల్‌లోని ధిగ తీరానికి మంగళవారం క్షేమంగా చేరింది. బోటులో వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు కొపనాతి రామకృష్ణ వర్మ, సంగాడి తాతారావు, కొల్లాటి ఏసుదాసు, పాలేపు శాంతారావు, కర్రి రాముడు, కాటాడి సతీష్, కొల్లాటి శ్రీనుబాబు ధిగ తీరానికి క్షేమంగా చేరుకున్నారు. ఈ నెల 3న ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు వేటకు బయలుదేరారు. 

5న వేట సాగించుకుంటూ ముందుకు వెళ్తుండగా బోటు ఇంజిన్‌లోని గేర్‌బాక్స్‌లో లోపం తలెత్తింది. దీంతో వారికున్న పరిజ్ఞానంతో దాన్ని సరిచేశారు. మళ్లీ కొంత దూరం వెళ్లాక గేర్‌బాక్స్‌ వేడెక్కి ఇంజిన్‌ ఆగిపోయింది. ఇక చేసేదేమీ లేక బతుకు జీవుడా అంటూ గాలి వాటు ఆధారంగా బోటులో ప్రయాణం చేశామని కొపనాతి రామకృష్ణవర్మ ఫోన్‌లో తెలిపారు. ఉన్న కొద్దిపాటి ఆహారంతో ఒక పూట తింటూ, మరో పూట పస్తులున్నామని, చివరి 3 రోజులూ పూర్తిగా పస్తులున్నామని చెప్పారు. చివరకు పశ్చిమ బెంగాల్‌లోని ధిగ తీరంలో స్థానికంగా వేట సాగిస్తోన్న మత్స్యకారుల సహకారంతో అక్కడి తీరానికి చేరుకున్నామని తెలిపారు. 

అనంతరం తాము క్షేమంగానే ఉన్నామంటూ కుటుంబీకులకు సమాచారమిచ్చారు. 23 రోజులుగా నరకయాతన అనుభవించి, ఒక పూటే తిని, మరో పూట పస్తులుంటూ గంగమ్మను నమ్ముకుని ఆ మత్స్యకారులు క్షేమంగా చేరుకోవడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కాగా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో సురక్షితంగా ఉన్న ఏడుగురు మత్స్యకారులను త్వరగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement