సర్ కొనసాగుతుండగానే ఎన్నికల సన్నాహాలు సరికాదు
తుది ఓటర్ల జాబితా వచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలి
ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలి
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పూర్తి కాక ముందే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ 01.01.2026ని అర్హత తేదీగా తీసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటానికి దిగింది. సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత మాత్రమే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టును అభ్యర్థించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు భిన్నంగా...
‘దేశవ్యాప్తంగా చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌సహా 19 రాష్ట్రాల్లో 01.07.2026ను అర్హత తేదీగా తీసుకుని సర్‌ను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుంటూ పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రచురితం అయ్యాయి.
ఈ నేపథ్యంలో సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి మేం వినతి పత్రం ఇచ్చాం. 31.07.2026న ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు నమోదై ఉన్నాయి. తుది జాబితా 03.10.2026న వెలువడాల్సి ఉంది’ అని అప్పిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘానిది ఏకపక్ష నిర్ణయం
‘సర్ ప్రక్రియ పూర్తికాకముందే 01.01.2026 అర్హత తేదీతో పాత, తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది. మరణించిన, నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రోటేషన్ విధానం దెబ్బతింటుంది. పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే తయారవుతుంది.
చట్ట సవరణల ద్వారా జూలై 1ని కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం 01.01.2026 తేదీనే ఎంచుకోవడం ఏకపక్షం. ఈ విషయంలో మా ఆందోళనను సంఘం పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుత, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. పారదర్శకతకు ఏ మాత్రం స్థానం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు.
హైకోర్టుకు అభ్యర్థనలు..
» 01.01.2026ని అర్హత తేదీగా తీసుకుని వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి.
» ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ వార్డు ఓటర్ల జాబితానైనా ప్రచురిస్తే దానిని తాత్కాలికమైనదిగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలి.
» ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ వరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో జరిగే అన్ని రకాల చేర్పులు, తొలగింపులు అన్నీ కూడా స్థానిక వార్డు ఓటర్ల జాబితాలో కూడా ప్రతిబింబించేలా ఆదేశించాలి.
» నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ నాటికి ఈ సవరణలన్నింటినీ చేరుస్తూ ఒక అనుబంధ (సప్లిమెంటరీ) ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి.


