అంబేడ్కర్ కోనసీమ జిల్లా చిర్రయానంలో కలకలం
సముద్రతీరంలోని కాలభైరవ స్వామి ఆలయ సమీపంలో అర్ధరాత్రి హైడ్రామా
ఓ మహిళతోపాటు తొమ్మిది మంది అపరిచితులను గుర్తించి నిలదీసిన గ్రామస్తులు
చిన్నారిని తీసుకుని నలుగురు పరారు
మహిళతోపాటు ఐదుగురిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు ఓ చిన్నారిని బలిచ్చేందుకు తీసుకొచ్చారని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. నిందితులను నిలదీస్తే చిన్నారిని తీసుకుని నలుగురు పరారవ్వగా, మహిళతోపాటు ఐదుగురిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చిర్రయానం సముద్ర తీరంలో కాలభైరవ స్వామి ఆలయం ఉంది. దీనికి సుమారు కిలోమీటరు దూరంలో తీరాన సరుగుడు, తుమ్మ చెట్లు దట్టంగా ఉన్నాయి.
ఆ ప్రాంతానికి మంగళవారం రాత్రి 11 గంటలకు ఓ మహిళతోపాటు తొమ్మిది మంది గుర్తు తెలియని వ్యక్తులు కొత్త కారు, ఏపీ 05 ఈఈ 8557నంబరు గల మోటార్ సైకిల్‌పై చేరుకున్నారు. వీరిని అక్కడే ఉన్న ఇద్దరు గ్రామస్తులు ‘ఎవరు మీరు’ అంటూ ప్రశ్నించారు. తమది కోతుల చెరువు అని, మల్లాడి ధన కిషోర్ తెలుసా అని ఎదురు ప్రశ్నించాడు. అదే సమయంలో తోటలో మరి కొంత మంది ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు గ్రామస్తులు లైట్లు వేసుకుని అక్కడకు వెళ్లారు. వారిని చూసి, అక్కడున్న నలుగురు వ్యక్తులు పదేళ్లలోపు పాపను తీసుకుని ఒక్కసారిగా పరారయ్యారు.
ఈ విషయంపై వారిద్దరూ మిగిలిన గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకుని కారును అడ్డుకుని మహిళతోపాటు ఐదుగురు వ్యక్తులను గట్టిగా నిలదీశారు. దీంతో గుప్త నిధుల కోసం పూజలు చేసేందుకు వచ్చామని ఆ మహిళ చెప్పింది. ఆ కారులో కొబ్బరి కాయలు పూజా సామగ్రి ఉన్నాయి. అదే సమయంలో కత్తి పట్టుకుని ఉన్న ఓ వ్యక్తి మోటారు సైకిల్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. తోటలో ఉన్న నలుగురు వ్యక్తులతోపాటు చిన్నారిని కూడా కారు వద్దకు తీసుకుని రావాలని గ్రామస్తులు పట్టుబట్టారు. తమ వెనుక ప్రజాప్రతినిధులున్నారంటూ నిందితులు బెదిరించడంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించారు.
అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వారిని పంపేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఆ ప్రాంతంలో చాకు, రెండు పారలు, కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, పేలాలు, పేడ, తాళ్లు, సంచులు, కల్లు, కూల్ డ్రింక్, మంచి నీటి బాటిళ్లను గుర్తించామని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై కాట్రేనికోన ఎస్సై అవినాష్‌ను వివరణ కోరగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని చెప్పారు.


