అమలాపురం మండలం నడిపూడిలో టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి ప్రతిపాదించిన స్థలం
● టీడీపీ కార్యాలయానికి
రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం
● అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి
● నామమాత్రపు ధరకే 66 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు మున్సిపాలిటీ ప్రతిపాదన
● అమలాపురంలో రగులుతున్న వివాదం
సాక్షి, అమలాపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయ్యింది. ఇళ్లు కట్టుకునేందుకు ఒక్క పేదవాడికి సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఒక్కచోట కూడా స్థలం కేటాయించలేదు. కొత్తగా ఒక్క ప్రభుత్వ కార్యాలయ భవనం కూడా నిర్మించలేదు.
కానీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి మాత్రం కోట్ల రూపాయల విలువ చేసే రెండెకరాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతోంది. అది కూడా పట్టణ ప్రజలకు తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కోసం కేటాయించిన.. భవిష్యత్తులో ఇక్కడ నిర్మాణాలు చేసేందుకు ఉద్దేశించిన స్థలాన్ని అప్పనంగా కట్టబెట్టేందుకు పావులు కదుపుతోంది.
పచ్చ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్న వ్యవహారం నిర్విఘ్నంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు మన జిల్లా కేంద్రమైన అమలాపురం చేరింది. అమలాపురం రూరల్ నడిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో అమలాపురం మున్సిపాలిటీకి రూ.5 కోట్లకు పైగా విలువైన రెండెకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇంత విలువైన ఈ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి 66 ఏళ్ల లీజుకు నామమాత్రపు ధరకు ఇవ్వాలని ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద ఫైళ్లను పరుగులు పెట్టిస్తోంది.
అధికారులపై ఒత్తిడి తెచ్చి..
వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పంపు హౌస్ నిర్మించేందుకు 1999లో ప్రభుత్వం 43 ఎకరాల భూమి సేకరించి, అమలాపురం మున్సిపాలిటీకి అప్పగించింది. అందులో సర్వే నంబర్ 80–1లో 0.50 ఎకరాలు, 92–1బిలో 1.50 ఎకరాలు కలిపి మొత్తం రెండెకరాలు ఖాళీగా ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ భూమిని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి 99 ఏళ్లకు లీజుకు కావాలని ఆ పార్టీ కోరింది. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు 66 ఏళ్లు లీజుకు ఇచ్చేందుకు ఈ ఏడాది మే 13న తీర్మానం చేశారు. మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం పూర్తయిన తరువాత ఈ తీర్మానం చేసేలా మున్సిపల్ అధికారులపై టీడీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూమి ఇవ్వాలనే జీఓను అనుసరించి ఈ భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
ఈ మొత్తం కథలో ట్విస్ట్ ఏమిటంటే తీర్మానం చేసిన మున్సిపాలిటీ భూమి అప్పగించేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇవ్వకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ఈ రెండెకరాల భూమి కేటాయింపుపై అప్పటి ఆర్‌డీఓ మమ్మీ అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. 2012 సెప్టెంబర్ 14న విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 571, రెవెన్యూ అసైన్‌మెంట్–1 అనెగ్జర్–ఇ–క్లాజ్ (సీ)
(వీఐఐ) ప్రకారం ఇలా మున్సిపల్ అవసరాల కోసం సేకరించిన భూమిని రాజకీయ పార్టీ కార్యాలయానికి లీజుకు కేటాయించేందుకు అవకాశమే లేదని ఆర్‌డీఓ పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ఈ భూమిని కేటాయించేందుకు ఉన్నత స్థాయి అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు స్థానిక సంస్థలకు చెందిన భూములను ఇలా పార్టీ కార్యాలయాలకు కేటాయించడమే తప్పని, నిబంధనలకు విరుద్ధమని పలువురు అంటున్నారు.
విపక్షాలు, ప్రజాసంఘాల ఆగ్రహం
పేదలకు సెంటు స్థలం ఇవ్వడానికి ఆలోచిస్తున్న ప్రభుత్వం, సొంత పార్టీ ఆఫీసులకు మాత్రం కోట్ల విలువ చేసే మున్సిపల్ భూములను 66 ఏళ్ల లీజుకు ధారాదత్తం చేయడమేమిటంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రశ్నిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ భూమిని పార్టీ కార్యాలయానికి ఇవ్వడం ప్రజాద్రోహమని మండిపడుతున్నారు. రూ.5 కోట్ల విలువైన ఈ రెండెకరాల స్థలం వ్యవహారాన్ని అధికార టీడీపీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు తప్పు పడుతున్నాయి.
ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు కానీ..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యుడుకి సెంటు భూమి కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు, పల్లెల్లో మూడు సెంట్ల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. ఇప్పటి వరకూ సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. కానీ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో రూ.5 కోట్ల విలువ చేసే భూమిని మాత్రం వెన్నుపోటు పార్టీ టీడీపీకి ఇచ్చేందుకు ఎలా సిద్ధపడ్డారు? అసలు ఈ భూమి ఇచ్చేందుకు మున్సిపల్ కమిషనర్ ఎలా ప్రతిపాధన చేశారు. దీని మీద ప్రభుత్వ అధికారులు పునరాలోచన చేసి, భూమి కేటాయింపును రద్దు చేయాల్సిందే.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
ఇది ప్రజాద్రోహం
అమలాపురం మున్సిపాలిటీ తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన భూమిలో టీడీపీకి రెండెకరాలు లీజుకివ్వడం ప్రజాద్రోహం. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం లేదు కానీ, పార్టీ ఆఫీసుకు మాత్రం కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చేస్తారా? ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, స్టడీ సర్కిల్ వదిలేసి పార్టీకి దోచిపెట్టడం తగదు. తక్షణం ఈ కేటాయింపు రద్దు చేయాలి.
– బొంతు రమణ, వీకేసీ పార్టీ
రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ


