తాళ్లరేవు: హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ) ట్రైనీలు బుధవారం కోరింగా అభయారణ్యాన్ని సందర్శించారు. స్టడీ టూర్‌లో భాగంగా చొల్లంగిలోని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజాన్ని (సీబీఈటీ) సందర్శించి, పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఎఫ్‌బీఓ కె.మహేష్‌లు మడ అడవుల విశిష్టత, వన్యప్రాణుల సంరక్షణ, సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతలను వివరించారు. కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ వి.మంజుక్, ఎఫ్‌ఎస్‌ఓ ఎస్.వీరభద్రరావు, సీహెచ్ ధనలక్ష్మి, పి.సంధ్యారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
టెట్ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
ముమ్మిడివరం: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్–1938 జిల్లా శాఖ ఆధ్వర్యాన ముమ్మిడివరంలోని విద్యా శాఖ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌లో ఏపీటీఎఫ్–1938 సూచనల మేరకు కొన్ని సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్‌ఎన్ మునేశ్వరరావు మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. లేదంటే టెట్ అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ అవసరాలపై
ప్రత్యేక ప్రణాళిక
అమలాపురం రూరల్: గ్రామ ప్రజల స్థానిక అవసరాలు, సమస్యలు, ప్రభుత్వ పథకాల అవసరాలను గుర్తించి, గ్రామ సమృద్ధి ప్రతిఘటన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ దుండి రాంబాబు తెలిపారు. ఈ అంశంపై జిల్లాలోని 19 మండలాలకు చెందిన ఒక్కో ఎంపీఎం, సీసీలు, అకౌంటెంట్లకు అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజులు పాటు జరిగిన శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ, వీబీ జీ రామ్ జీ, పీఎంఏవై, ఉజ్వల, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన కుటుంబాలకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అలాగే, వ్యవసాయం, పశుపోషణ, చిన్న వ్యాపారాలు, నైపుణ్య శిక్షణ, ఇతర ఆదాయ వనరుల ద్వారా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచడం.. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, ఇతర ప్రాథమిక మౌలిక వసతుల కల్పన వంటి అవసరాలను కూడా గుర్తిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంలు ఎ.గణేష్, అన్నపూర్ణ, ఎంపీడీఓ విజయకుమార్, ఎంపీఎం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


