● కడలిలోకి 4,63,583 క్యూసెక్కులు
● ఎగువన తగ్గుముఖం
ఐ.పోలవరం: ఎల్‌నివో ప్రభావంతో వట్టిపోతోందనుకున్న గోదావరికి మరోసారి వరద వచ్చింది. ఎగువన పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉపనదులైన ఇంద్రావతి, శబరి నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే, తాలిపేరు నుంచి వరద నీరు దిగువకు రావడంతో బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి నీటి ఉధృతి పెరిగింది. దీంతో, ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మిగులు జలాల విడుదలను పెంచారు. బ్యారేజీ వద్ద ఉదయం 6 గంటలకు ఇన్‌ఫ్లో 3,69,994 క్యూసెక్కులుగా నమోదైంది. ఇందులో డెల్టా కాలువలకు 14,800 క్యూసెక్కులు విడుదల చేసి, మిగిలిన 3,55,194 క్యూసెక్కులు సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రి 7 గంటల సమయానికి వరద పెరగడంతో దిగువకు 4,63,583 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటి ఉధృతి గురువారం సాయంత్రం వరకూ పెరిగి అనంతరం, తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలం వద్ద ఉదయం 9 గంటలకు 5,97,982 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో, అక్కడ మధ్యాహ్నం 35.2 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం నిలకడగా ఉండి, 3 గంటల నుంచి తగ్గుముఖం పడుతూ, సాయంత్రం 6 గంటలకు 33.80 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా నమోదైంది. వరద ప్రభావం కోనసీమ లంక గ్రామాలపై కనిపిస్తోంది. అయితే, ఎగువన వరద నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని తెలిసి లంక వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ముంపు ముప్పు లేదన్న అధికారులు
బ్యారేజీ నుంచి వరద నీరు విడిచిపెట్టడంతో జిల్లాలోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో నీటి ఉధృతి పెరిగింది. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద వరద నీరు ఉరకలేస్తూ సముద్రం వైపు పరుగులు తీస్తోంది. జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో వచ్చిన వరదకు జిల్లాలోని లంక గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. కూరగాయలు, ఉద్యాన పంటలు నీట మునిగి, రాకపోకలు స్తంభించాయి. ఆగస్టు నెలాఖరులో మళ్లీ వరద రావడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుత వరదతో ఎలాంటి ముంపు ముప్పూ లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.


