వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి
అప్పట్లో శరవేగంగా ప్రాజెక్టు పనులు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి
ఆ ప్రాజెక్టు పనుల్లో తన పాత్ర ఏమిటో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి
స్థానిక ఎన్నికలను నిష్పక్షపాతంగా జరుపుతాడన్నది అనుమానమే
పాలన ఈ విధంగా ఉంటే వెన్నుపోటు పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారు?
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఏమీ చేయకపోయినా, ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. పనులు వేగంగా చేశారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రెండు సొరంగాల పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిటనేది చంద్రబాబు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబుది క్రెడిట్ చోరీ.. ఏమీ చేయకున్నా ఘనత(క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్) తనదేనంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సూటిగా సమాధానాలు చెప్పారు. ‘స్థానిక ఎన్నికలను చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుపుతాడన్నది అనుమానమే. కానీ, ప్రజాస్వామ్యంలో పోరాడక తప్పదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పోలీసులను ఉపయోగించి.. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించి.. నోట్ల కట్టలను వెదజల్లారు.. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది.. 2019 ఎన్నికల్లో నంద్యాల శాసనసభ స్థానంలో 37 వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలి.
డీబీటీ ద్వారా ప్రజలకు మేం చేసిన మంచి చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్లాం.. అందుకే భారీ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు’ అని వైఎస్ జగన్ ఓ ప్రశ్నకు స్పష్టంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వెఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని తేలిందని సర్వే సంస్థలు వెల్లడించడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘చంద్రబాబు పాలన ఈ విధంగా ఉంటే వెన్నుపోటు పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారు?’ అని అన్నారు.


