సాక్షి, గుంటూరు: పెదకాకాని శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురు అర్చకులను అధికారులు సస్పెండ్ చేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు చదలవాడ జాలయ్య చదలవాడ మణికంఠ శాస్త్రి, పొత్తూరు విజయ్ ప్రతాప్, కందుర్తి విశ్వనాధ్, గిరికుమార్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. చోరీతో తమకు సంబంధం లేదని నిన్న అర్చకుల ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్ పెట్టిన 24 గంటల్లోనే అర్చకులపై ప్రభుత్వం వేటు వేసింది. ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి నగలు మాయంపై అర్చకులు స్పందిస్తూ.. ఆలయ ప్రాంగణంలో నిన్న(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించారు. శివాలయంలో భగవంతుని సేవ చేసుకుని జీవనం సాగిస్తున్నామే కానీ దొంగలం కాదని ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు అన్నారు. స్థానాచార్యులు మాట్లాడుతూ స్వామి సేవ చేసుకోవడమే తప్ప దొంగతనం చేసే వారము కాదన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే శ్రావణమాసం విశేష అలంకరణల్లో భాగంగా ఈనెల 14వ తేదిన భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూలలతో అలంకరణ చేసి నగలు అలంకరించామన్నారు.
18వ తేదీ మంగళవారం డ్యూటీలో ఉన్న అర్చకుల ద్వారా అమ్మవారి మంగళసూత్రాలు, నాన్‌తాడు కనిపించడం లేదని తెలుసుకుని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. విచారణకు హాజరు కావాలని సమాచారం అందిన వెంటనే స్టేషన్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలంకరించిన పూలు తొలగించే క్రమంలో పూలమాలల్లో ఆ ఆభరణాలు పోయి ఉండవచ్చని భావిస్తున్నామని వివరించారు.
40 ఏళ్ళుగా ఆలయంలో అర్చకత్వం చేస్తున్నామని, ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని అభిప్రాయపడ్డారు. నేరం చేసిన వారికి ఎటువంటి శిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదని, మేము అర్చకత్వం చేసుకునేటపుడు ఆలయంలో అమ్మ వారి ఆభరణాలు మాయం కావడంపై భక్తులకు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పొత్తూరి సాంబశివరావు తెలిపారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకుడు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చదలవాడ జాలయ్య, ఉప ప్రధాన అర్చకులు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.


