సాక్షి, తిరుపతి: తిరుపతిలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఆర్సీ రోడ్డులోని కలశం బిల్డింగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ గోడౌన్ ఎదురుగా ఉన్న భవనం కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అయితే, నూతన భవనం నిర్మాణం కోసం పక్కనే గుంత తవ్వుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గుంత తవ్వకాల్లో భాగంగా భవనం పునాదులు బలహీనపడటంతోనే కూలిపోయినట్లు సమాచారం. భవనం కూలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


