సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే అని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది వైఎస్సార్‌సీపీనే. మా కేబినెట్‌లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మేం ఎన్నికలకు వెళ్లాం. సుప్రీంకోర్టు, హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది మేమే. మా కేబినెట్‌లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాం. 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలను పంపింది మేమే. రెండు డిప్యూటీ సీఎం పదవులు కూడా బీసీలకే ఇచ్చాం.
అలాగే, 13 జెడ్పీ చైర్మన్ సీట్లలో ఆరు బీసీలకే ఇచ్చాం. 13 మేయర్ స్థానాల్లో బీసీలకే 9 ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానల్లో బీసీలకే 239 ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకే ఇచ్చాం. 196 ఏఎంసీ చైర్మన్ స్థానాల్లో బీసీలకే 76 ఇచ్చాం. ఇవ్వన్నీ చట్టం చేసి మరీ ఇవ్వడం వైఎస్సార్‌సీపీకే సాధ్యపడింది. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం కేటాయించాలని పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టించాం. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. వివిధ పథకాల ద్వారా డీబీటీ పద్దతిలో ఇచ్చాం. రూ.లక్షా 30వేల కోట్లు బీసీలకు అందజేశాం.
బీసీల బతుకులను చంద్రబాబు బుగ్గిపాలు చేశాడు. మా హయాంలో అమలైన పథకాలను రద్దుచేశాడు. మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో వేశాడు. రాజకీయంగా ఎదిగే బీసీలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి సీదిరి అప్పలరాజును జైలులో పెట్టించారు. ఓ మహిళా ఎస్‌ఐను అడ్డుపెట్టుకుని చింతాడ రవిని అక్రమంగా జైలుకు పంపారు. కర్నూలులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తే విరూపాక్షిపై తప్పుడు కేసులు పెట్టారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


