స్టిక్కీ నోట్‌తో గిన్నిస్‌ రికార్డు | UAE Woman Writes 150 Words On One Sticky Note Sets Guinness World Record | Sakshi
Sakshi News home page

స్టిక్కీ నోట్‌తో గిన్నిస్‌ రికార్డు

Aug 26 2026 9:34 AM | Updated on Aug 26 2026 11:32 AM

UAE Woman Writes 150 Words On One Sticky Note Sets Guinness World Record

ప్రపంచ రికార్డు సాధించడమే జీవితాశయంగా పెట్టుకుంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన పుష్పజ్యోతి రవికుమార్‌ (29). రికార్డులోకెక్కడానికి ఒక చిన్న స్టిక్కీ నోట్‌పై ఏకంగా 150 పదాలను స్పష్టంగా రాసి, గిన్నిస్‌బుక్‌లోకెక్కింది. మొదటి ప్రయత్నంలోనే పుష్పజ్యోతి ఈ రికార్డుని సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

మనలో చాలామంది స్టిక్కీ నోట్‌ను కేవలం షాపింగ్‌ జాబితాలకో లేదా చిన్న విషయాలు గుర్తుంచుకోవడానికో వాడతాం. కానీ, దుబాయ్‌లో సీనియర్‌ క్లౌడ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పుష్పజ్యోతికి మాత్రం అది ఒక ప్రపంచ వేదికగా కనిపించింది. అదే చిన్న కాగితం ముక్కపై ఏకంగా 150 పదాలను అత్యంత స్పష్టంగా రాసి, ఒకే స్టిక్కీ నోట్‌పై అత్యధిక పదాలు రాసిన రికార్డును తన పేరుపై లిఖించుకున్నారు. 

మొదటి ప్రయత్నంలోనే..
ఈ సవాలులో కేవలం పదాలను ఇరికించి రాయడం మాత్రమే కాదు, అవి చదవడానికి వీలుగా ఉండడం కూడా ముఖ్యం. తక్కువ స్థలంలో ఎక్కువ పదాలను పట్టించడానికి ఆమె జాగ్రత్తగా చిన్న చిన్న పదాలను ఎంచుకున్నారు. అందులోనూ ఎక్కువ శాతం కేవలం మూడు అక్షరాలు ఉన్న పదాలనే ఉపయోగించారు. 

వేర్వేరు చేతిరాత శైలులలో ప్రయోగాలు చేయడం పుష్పజ్యోతికి అలవాటు. అందువల్ల తక్కువ స్థలంలో స్పష్టంగా రాయడం ఆమెకు సులువైంది. బాల్యం నుంచే గిన్నిస్‌ బుక్‌లో రికార్డు సాధించాలని పుష్పజ్యోతి ఆకాంక్ష. అలా ఆమె తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించింది.

ప్రశంసల జల్లులు
పుష్పజ్యోతి తన విజయానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోగానే ఆమెపై ప్రశంసల జల్లులు కురిసాయి. సుమారుగా పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఆశయానికి అంకితభావం తోడైతే, సాధించలేనిది ఏదీ లేదని పుష్పజ్యోతి నిరూపించింది.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు విజేతగా మారడం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత గానో పెంచింది. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుంది. దానిని వెలికితీసి ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించడమే నా లక్ష్యం. 
 

– పుష్యజ్యోతి రవికుమార్‌ 

 

(చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement