సీఎం రమేష్‌ అక్రమ మైనింగ్‌ | CM Ramesh's Illegal Mining in Panchadarla Hills | Sakshi
Sakshi News home page

సీఎం రమేష్‌ అక్రమ మైనింగ్‌

Aug 26 2026 1:01 PM | Updated on Aug 26 2026 1:46 PM

 CM Ramesh's Illegal Mining in Panchadarla Hills

సీఎం రమేష్‌తో వెంగమాంబ శ్రీనివాస్‌ చౌదరి

ఆ క్వారీకి లీజుల్లేవు.. పర్యావరణ అనుమతులు అంతకంటే లేవు. ప్రభుత్వ రికార్డుల్లో మూతపడినట్లు కనిపిస్తుంది.. కానీ వాస్తవానికి అక్కడ నిత్యం వందలాది లారీలు ఖనిజాన్ని తరలించేస్తున్నాయి. కళ్లెదుటే దోపిడీ జరుగుతున్నా అధికారులు కిమ్మనడంలేదు...ఎందుకంటే దాని వెనకున్నది ఎంపీ సీఎం రమేష్‌ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్,  ‘వెంగమాంబ’ క్రషర్స్‌ అధినేత శ్రీనివాస్‌ చౌదరిలతో కూడిన మైనింగ్‌ మాఫియా. అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్‌ సాగిస్తున్న దోపిడీకి అంతు లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ రూ.వందల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్‌ వివరాలివీ.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అనకాపల్లి మండలం సీతానగరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 251, 190, 303లో ‘వెంగమాంబ క్రషర్స్‌’ పేరుతోనూ అక్రమ మైనింగ్‌ సాగిస్తున్నారు. వాస్తవానికి సర్వే నం. 251లో జీఎస్‌ఎన్‌ శ్రీనివాస్‌ పేరిట ఉన్న 4 హెక్టార్లు, 1 హెక్టారు లీజుల గడువు వరుసగా మే 2023, ఫిబ్రవరి 2022 నాటికే ముగిసిపోయాయి. అలాగే సర్వే నం.193, 303లలో సుమారు 3 హెక్టార్లలో వీవీఆర్‌ స్టోన్‌ క్రషర్స్‌ (వెంగమాంబ శ్రీనివాస్‌ చౌదరి) పేరిట ఉన్న లీజులకు సైతం ఎలాంటి అనుమతులు లేవు. గతంలో వచ్చిన అక్రమ మైనింగ్‌ ఫిర్యాదులతో ఈ క్వారీలు మూతపడ్డాయి. మైనింగ్‌ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. కానీ, నిబంధనలకు పాతరేసి ప్రతిరోజూ ఇక్కడ తవ్వకాలు జరిపి ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తరలించేస్తున్నారు. 

పథకం ప్రకారం చేతులు కలిపి... 
తన అక్రమ వ్యాపారాలకు రక్షణ కవచం ఏర్పాటు చేసుకునేందుకు వెంగమాంబ శ్రీనివాస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో చేరి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. వెంగమాంబకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత పీలా గోవింద్‌ కూడా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం స్వయంగా పీలా మాట్లాడిన ఆడియో మెసేజ్‌ కలకలం రేపింది. 

అనుమతిలేని చోట అడ్డగోలు తవ్వకాలు 
పాత జరిమానాలకు సంబంధించి ఒక్క పైసా కూడా చెల్లించకపోగా, మైనింగ్‌ శాఖ డిమాండ్‌æ నోటీసులు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు నడుస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎంపీ సీఎం రమేష్‌ అండతో..  పర్యావరణ, మైనింగ్‌ అనుమతులు లేకుండానే రూ.వందల కోట్ల విలువైన ఖనిజాన్ని యథేచ్ఛగా దోచేస్తున్నారు. అనుమతి లేని చోట అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పట్టపగలే అక్రమ మైనింగ్‌ నడుస్తూ రోడ్డు మెటల్, బోల్డర్లు రవాణా అవుతున్నా..ఎంపీ జోక్యం ఉండడంతో అటు మైనింగ్‌ శాఖ అధికారులతో పాటు రవాణా, రెవెన్యూ యంత్రాంగం కూడా అడ్డుకునే సాహసం చేయలేకపోతోంది. కళ్లెదుటే కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజిలెన్స్‌ అధికారికి లంచం ఆఫర్‌!
వెంగమాంబ స్టోన్‌ క్రషర్స్‌ అక్రమాల చరిత్ర ఈనాటిది కాదు. 2020లో మైన్స్‌ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఈ క్వారీల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అనుమతులకు మించి ఏకంగా 5,68,923 క్యూబిక్‌ మీటర్ల ఖనిజాన్ని అక్రమంగా దోచేశారని నిర్ధారించారు. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసి, రూ. 33 కోట్ల మేర భారీ జరిమానా విధించారు. అయితే ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం విజిలెన్స్‌ మైనింగ్‌ అధికారికి వెంగమాంబ యజమాని ఏకంగా రూ. 3 కోట్ల మేర లంచం ఇవ్వజూపారంటూ ఆరోపణలు రావడం.. కలకలం రేపింది. వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతోందని స్థానికులు మొత్తుకున్నా లెక్కచేయకుండా మైనింగ్‌ డాన్‌కి సహకరించారన్న ఆరోపణలతో అప్పట్లో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు కూడా పడింది.

రూ.15 వేల జీతగాడు.. మైనింగ్‌ ఓనర్‌.! 
పంచదార్లలో మైనింగ్‌ లీజు తీసుకున్న విజయకుమార్‌ నాయుడు సీఎం రమేష్‌కు సమీప బంధువు, వరుసకు అల్లుడు. యర్రగొండ్లకు చెందిన విజయ్‌కుమార్‌ గతంలో సీఎం రమేష్‌ అన్న సురేష్‌ నాయుడు దగ్గర రూ.15 వేల జీతంతో పీఏగా పనిచేశారు. తర్వాత సీఎం రమేష్‌ పీఏగా మారారు. అనకాపల్లి రాజకీయ వ్యవహారాల్లో పీఏ విజయ్‌కుమార్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రూ.15 వేల జీతగాడైన విజయ్‌కుమార్‌.. తక్కువ కాలంలోనే మైనింగ్‌ ఓనర్‌గా ఎలా అయ్యారనేదే ప్రశ్నార్థకంగా మారింది. తన కంపెనీ మైనింగ్‌ పేరుతో రిత్విక్‌ ప్రాజెక్టులకు గ్రావెల్‌ సరఫరా చేస్తున్నట్లు చూపిస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Godavari Pushkaralu: పది కోట్ల మంది భక్తులు వస్తారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement