సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనుల పురోగతిపై సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. దేశ విదేశాల్లోని ప్రముఖులందరినీ పుష్కరాలకు ఆహ్వానించామన్నారు.
ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. 2015 పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా.. రానున్న పుష్కరాల్లో రోజుకు సుమారు కోటి మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని తట్టుకునేలా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు.


