హిరోసాకి: పురాతన సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానం ‘హికియా’ పద్ధతిని ఉపయోగించి, ఉత్తర జపాన్‌లోని సుమారు 1,800 మంది వాలంటీర్లు కలిసి 396 టన్నుల బరువున్న చారిత్రక ‘హిరోసాకి’ కోటను విజయవంతంగా కదిలించారు. గతంలో భూకంపం కారణంగా దెబ్బతిన్న ఈ కోట పునరుద్ధరణ పనులు పూర్తవడంతో, దానిని తిరిగి అసలు స్థానానికి చేర్చే ప్రక్రియలో భాగంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కోటను ప్రస్తుతానికి రెండు మీటర్లకు పైగా ముందుకు జరిపారు.
ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన 1,800 మంది వాలంటీర్ల కోసం దాదాపు 8,000 దరఖాస్తులు వచ్చాయని హిరోసాకి నగర ఉద్యానవనాలు, పచ్చదనం విభాగం అధిపతి కెన్సుకే హయసాకా తెలిపారు. స్థానిక నగరవాసులతో పాటు జపాన్ నలుమూలల నుంచి, ఆగ్నేయాసియా, ఐరోపా, ఉత్తర అమెరికా వంటి విదేశాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. భవనాన్ని కూల్చకుండా రోలర్లపై ఉంచి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రాచీన జపాన్ పద్ధతినే ‘హికియా’ అంటారు.
#弘前城 #天守曳戻し #イベント 4日目!
「そーれ!」の掛け声で参加者が一斉に綱を引っ張り、力を合わせて天守を移動させる曳戻し。
この4日間で天守が318cm移動しました!#弘前 #ひろさき #hirosakicastle #hirosakipark #aomori #tohoku #visitjapan #japantrip #japantravle #hirosaki pic.twitter.com/631i4r1ZwA— 弘前市シティプロモーション (@hirosaki_promo) August 25, 2026
కోట రాతి పునాదిని సురక్షితంగా పునర్నిర్మించేందుకు వీలుగా 2015లో దీనిని అసలు స్థానం నుంచి దాదాపు 78 మీటర్ల దూరం తరలించారు. 2024 నాటికి 2,185 రాళ్లను పునరుద్ధరించి పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం కోటను తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు 80 మందితో కూడిన బృందాలు 30 మీటర్ల పొడవైన తాళ్లను లాగుతూ ‘సో-రే, సో-రే’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలించారు. ఆగస్టు నెలాఖరు వరకు సుమారు 4,100 మంది కలిసి కోటను మొత్తం 5 మీటర్లు తరలిస్తారు. మిగిలిన 73 మీటర్ల తరలింపు ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి యంత్రాల సహాయంతో పూర్తి చేయనున్నారు. 1611లో సుగారు వంశం నిర్మించిన ఈ కోట, 1627లో పిడుగుపాటుకు గురై దెబ్బతినగా 1810లో పునర్నిర్మించారు. జపాన్‌లో మిగిలి ఉన్న 12 పురాతన కోట బురుజులలో ఇది ఒకటి. ఇది ‘చెర్రీ బ్లూసమ్’ సమయంలో ఏడాదికి దాదాపు 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఇది కూడా చదవండి: సేఫ్టీ టూల్స్ పేరుతో మెటా మోసం.. నిజం ఒప్పుకున్న ఇన్‌స్టా చీఫ్


