బర్మింగ్‌హామ్‌కు చెందిన 18 నుంచి 25 ఏళ్ల యువ వాలంటీర్ల బృందం పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని సందర్శించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని కళ్లారా చూసింది. వాతావరణ మార్పులపై పుస్తకాలు, ఆన్‌లైన్ కథనాల ద్వారా అవగాహన ఉన్నప్పటికీ.. పర్వతాలపై ఉండే భారీ మంచు నదుల(హిమనీనదాలు) మధ్య జీవిస్తున్న ప్రజలను కలిసిన తర్వాత ఆ సమస్య తీవ్రత వారికి మరింత స్పష్టమైంది. సుమారు 50 వేల పౌండ్లు నిధులు సమీకరించిన ఈ బృందం ఘిజర్ జిల్లాలోని తాలి దాస్ గ్రామంలో స్థానిక కుటుంబాలతో కలిసి కొన్ని రోజులు గడిపింది. అక్కడి ప్రజలతో మాట్లాడి, వాతావరణ మార్పులు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకున్నట్టుగా ఈ బృందం తెలిపింది.
ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం వరకే పరిమితం కాలేదు. హిమానీనదాలు వేగంగా కరుగుతుండటంతో వాటి నుంచి ఏర్పడే సరస్సుల స్థానాలు మారుతున్నాయని, ఈ సరస్సులు ఒక్కసారిగా పొంగిపొర్లితే భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని, తాలి దాస్ గ్రామ ప్రజలు ఇప్పటికే ఇలాంటి విపత్తును ఎదుర్కొన్నట్లుగా వాలంటీర్లు గుర్తించామన్నారు. అయితే, హిమానీనద సరస్సు నుంచి వచ్చిన వరద వారి ఇళ్లను, జీవనాధారాలను తీవ్రంగా దెబ్బతీయడంతో వారు తమ పాత నివాసాలను వదిలి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయినప్పటికీ గ్రామస్థులు నిరాశ చెందకుండా సమష్టిగా తమ సమాజాన్ని పునర్నిర్మించుకోవడం ఈ బృంద వాలంటీర్లను ఎంతగానో ప్రభావితం చేసింది.
అయితే, స్థానిక ప్రజలకు తక్షణ సహాయం అందించడంతోపాటు భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంపై యువత దృష్టి పెట్టింది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే పరికరాలు, శిక్షణ అందుబాటులో ఉండేలా క్లైమేట్ డిజాస్టర్ రెస్క్యూ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో అత్యవసర సేవలు అక్కడికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. స్థానికులే ప్రారంభ దశలో స్పందించగలిగేలా ఈ కేంద్రం ఉపయోగపడనున్నట్లగా ఈ యువ వాలంటీర్లు తెలిపారు. అలాగే, చెట్లు నాటడంతో పాటు స్థానిక పాఠశాల పునరుద్ధరణ పనుల్లోనూ పాల్గొన్నారు.
ఉత్తర పాకిస్థాన్‌లో 7,000కుపైగా హిమానీనదాలు ఉన్నట్టుగా, ధ్రువ ప్రాంతాలను కాకుండా ప్రపంచంలోనే అత్యధిక మంచునదులు ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటిగా పర్యావరణ శాఖ గుర్తించింది. ఇవి కేవలం మంచు నిల్వలు మాత్రమే కాదు.. పర్వత ప్రాంతాల్లోని ప్రజలకు నీటి వనరులు, వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలకు కీలక ఆధారంగా ఉపయోగపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఇవి తరచూ కరగడంతో ఒకవైపు ఆకస్మిక వరదల ముప్పు పెరుగుతుండగా, మరోవైపు భవిష్యత్తులో నీటి లభ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే వాతావరణ మార్పు అక్కడి ప్రజల ఇళ్లు, వ్యవసాయం, నీటి వనరులు, జీవన భద్రత అన్నింటినీ ఒకేసారి ప్రభావితం చేస్తోంది.
అయితే, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల బాధ్యత మాత్రమే కాదు.. స్థానిక సమాజాల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ఒక విపత్తు జరిగిన తర్వాత సహాయం అందించడం కంటే, ముందుగానే స్థానిక ప్రజలకు శిక్షణ ఇవ్వడం, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం మరింత ప్రభావవంతమైన మార్గం అని ఈ పర్యటన.. యువ వాలంటీర్లు తెలియజేశారు. అలాగే, పాకిస్థాన్‌లోని ఈ పర్వత గ్రామం యువతకు వాతావరణ మార్పులపై అవగాహనతోపాటు సంక్షోభంలోనూ ప్రజలు ఎలా ఐక్యంగా నిలబడి తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలో ఈ బృందం తెలియజేసింది. 'మాకు వాతావరణ మార్పు దూరంగా ఉన్న పర్యావరణ సమస్య కాదు.. ప్రజల భవిష్యత్తును నేరుగా నిర్ణయించే అత్యవసర అంశం' అని బర్మింగ్‌హామ్‌కు తిరిగి వచ్చిన ఈ వాలంటీర్ బృందం యువత పేర్కొంది.


