అమెరికా ఆశలు తగ్గుముఖం! | 15 Percentage Decline In Indian Students Seeking Undergraduate Courses In US | Sakshi
Sakshi News home page

అమెరికా ఆశలు తగ్గుముఖం!

Aug 26 2026 5:43 AM | Updated on Aug 26 2026 5:43 AM

15 Percentage Decline In Indian Students Seeking Undergraduate Courses In US

అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్లు డౌన్‌ 

1100 వర్శిటీల సమాచారంతో నివేదిక 

గత ఏడాదితో పోలిస్తే 2025–26లో 15% తక్కువ 

వీసా విధానాల్లో మార్పులు కారణం

వాషింగ్టన్‌: అమెరికా చదువుల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే 2025–26లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్లలో 15 శాతం తగ్గుదల నమోదైనట్లు ‘కామన్‌ ఆప్‌’అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ద్వారా స్పష్టమైంది. ఈ సంస్థ సుమారు 1100 అమెరికన్‌ వర్శిటీల్లో అడ్మిషన్ల వ్యవహారాన్ని పరిశీలించిన తరువాత ఈ నివేదిక విడుదల చేసింది. 2026–27లో మాత్రం అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్లలో పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదే మయంలో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు మార్చి ఒకటి తరువాత పది శాతం పడిపోయినట్లు తెలిసింది.  

భారత్‌ నుంచి చదువుల కోసం ఏటా అమెరికాకు వెళ్లే వారు లక్షల్లో ఉంటారన్నది మనకు తెలిసిన విషయమే. 2024–25లో ఈ సంఖ్య 3.63 లక్షలు. స్వచ్ఛంద సంస్థ కామన్‌ ఆప్‌ నివేదిక ప్రకారం 2025–26లో విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించిన తోడ్పాటు విలువ ఏకంగా 4177 కోట్ల డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 3837 కోట్ల డాలర్లకు పడిపోనుంది. 

వీసా నియమ నిబంధనలు కఠినతరం కావడం, ట్రంప్‌ ప్రభుత్వ విధానాల్లో అస్థిరతల కారణంగా ఈ ఏడాది అమెరికా చదువుల కోసం విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులు 1.1 లక్షలు తగ్గిపోతాయని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేటర్స్, జేబీ ఇంటర్నేషనల్‌లు ఇటీవలే ప్రకటించాయి. వీరి అంచనాల ప్రకారం 2025–26 ఫాల్‌ అడ్మిషన్లకు 11.69 లక్షల దరఖాస్తులు అందితే.. ఈ ఏడాది అది 10.57 లక్షలకు పడిపోనుంది. 

చదువు తరువాత అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పించిన విధానాలను అమెరికా ఈ ఏడాది జూలైలోనే సవరించింది. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. అంతేకాకుండా.. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ) దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేసేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చి గ్రాడ్యుయేషన్‌ తరువాత అక్కడే కొంతకాలం పనిచేసేందుకు ఓపీటీ అవకాశమిస్తుంది.

 ఓపీటీలో భాగంగా పన్నెండు నుంచి 24 నెలలపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. కంపెనీలు విద్యార్థి వీసాలపై పనిచేస్తున్న వారి హెచ్‌1–బీ వీసాలకు స్పాన్సర్‌ చేయడం ద్వారా శాశ్వత ఉద్యోగులుగా మార్చుకునేందుకూ ఓపీటీ వీలు కల్పిస్తుంది. ఈ హెచ్‌1–బీ వీసాలపైనే భారతీయు టెకీలు చాలామంది తమ అమెరికా కలను నెరవేర్చుకుంటూంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement