సౌదీతో అణు ఒప్పందంపై డొనాల్డ్‌ ట్రంప్‌ మెలిక.. ఇజ్రాయెల్‌ ససేమిరా | Trump sends Saudi nuclear deal to Congress | Sakshi
Sakshi News home page

సౌదీతో అణు ఒప్పందంపై డొనాల్డ్‌ ట్రంప్‌ మెలిక.. ఇజ్రాయెల్‌ ససేమిరా

Aug 26 2026 7:26 PM | Updated on Aug 26 2026 8:05 PM

Trump sends Saudi nuclear deal to Congress

వాషింగ్టన్‌: సౌదీ అరేబియాతో పౌర అణు కార్యక్రమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్ష కోసం కాంగ్రెస్‌కు సమర్పించారు. అయితే, సౌదీ దేశం ఇజ్రాయెల్‌తో సంబంధాలను సమన్వయం చేసుకోకపోతే ఈ ప్రక్రియ ముందుకు సాగదని ఆయన పట్టుబడుతున్నట్లు ట్రంప్ పరిపాలనా యంత్రాంగ అధికారి ఒకరు తెలిపారు.

అణు శక్తి చట్టం ప్రకారం సంబంధిత పత్రాలను సోమవారం క్యాపిటల్ హిల్‌కు సమర్పించినట్లు సదరు అధికారి, అమెరికన్‌ కాంగ్రెస్ ముఖ్య అధికారులు వెల్లడించారు.ఈ ఒప్పందంపై గత నెల అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ అరేబియా తరఫున ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేశారు. మరుసటి రోజే ‘అబ్రహం ఒప్పందాల’ ద్వారా ఇజ్రాయెల్‌తో మెరుగైన సంబంధాలను కొనసాగించాలని తాను సౌదీలను కోరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చుతుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. 

సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ట్రంప్ పట్టుదల, పౌర అణుకార్యక్రమంపై తుది ఆమోదం పొందే ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.

2020లో కుదిరిన ‘అబ్రహం ఒప్పందాలు’ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉన్న అరబ్, ముస్లిం మెజారిటీ దేశాల సంఖ్యను పెంచాయి. అయితే, సౌదీ అరేబియాతో కుదుర్చుకోబోయే పౌర అణు ఒప్పందం పూర్తిగా అమలు కావాలంటే.. రియాద్ (సౌదీ రాజధాని) కూడా ఈ ‘అబ్రహం ఒప్పందాల్లో’ చేరి ఇజ్రాయెల్‌ను అధికారికంగా అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షరతు పెట్టారు. ఈ మెలిక పెట్టడం సౌదీ అరేబియా నాయకులకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కొంతమంది చట్టసభ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఒప్పందం ఏమిటి?
సౌదీ అరేబియాతో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి అమెరికా కుదుర్చుకున్న 30 ఏళ్ల ఒప్పందం. దీనిపై అమెరికా, సౌదీ ఇంధన మంత్రులు గత నెలలో సంతకాలు చేశారు. దీన్ని ఇప్పుడు ట్రంప్ ఆమోదం కోసం అమెరికా కాంగ్రెస్‌కు పంపారు.

ట్రంప్ షరతు 
సౌదీ అరేబియాకు అణు సాంకేతికత అందాలంటే.. వారు ముందుగా ‘అబ్రహం ఒప్పందాలు’ ద్వారా ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలకు అంగీకరించాలని ట్రంప్ మెలిక పెట్టారు.

సౌదీ వైఖరి ఏమిటి?
ఇజ్రాయెల్‌తో సంబంధాలు కలుపుకోవాలంటే ముందుగా ‘పాలస్తీనా దేశం’ ఏర్పాటుకు మార్గం చూపాలని సౌదీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

అమెరికాలో విమర్శలు  
ఇదిలా ఉంటే, సౌదీలకు పౌర అణు సాంకేతికత అందిస్తే, వారు సొంతంగా యురేనియంను శుద్ధి చేసుకుని అణు ఆయుధాల తయారీకి దారితీస్తుందని అమెరికాలోని కొందరు చట్టసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయాల నడుమ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement