మళ్లీ పుట్టుకొస్తున్న సముద్రపు దొంగలు..!! | Shadows of the Past: Somali Pirates Threaten Global Shipping Again | Sakshi
Sakshi News home page

మళ్లీ పుట్టుకొస్తున్న సముద్రపు దొంగలు..!!

Aug 26 2026 5:45 PM | Updated on Aug 26 2026 6:28 PM

photo credit: disney

దాదాపు దశాబ్దన్నర క్రితం కనుమరుగైపోయిందనుకున్న ఒక పెద్ద ప్రమాదం ఇప్పుడు సముద్రంలో మళ్లీ పుట్టుకొస్తోంది..! సముద్రపు దొంగలు సినిమాలకే పరిమితం అనుకుంటున్న తరుణంలో.. ఆఫ్రికాలోని సోమాలియా తీరంలో.. సముద్రపు దొంగల విజృంభన మళ్లీ మొదలైంది..! ఇటీవల ఏకంగా నాలుగు పెద్ద కమర్షియల్ షిప్‌లు (వాణిజ్య నౌకలు) హైజాక్‌కు గురయ్యాయి. 2012 తర్వాత ఇన్ని నౌకలు హైజాక్ అవ్వడం ఇదే మొదటిసారి..! ప్రస్తుతం ఆ నౌకలతోపాటు.. వాటిలోని 67 మంది సిబ్బంది ఆ దొంగల చెరలోనే ఉన్నారు. కోట్ల రూపాయల కోసం బేరసారాలు నడుస్తున్నాయి. అసలు ఇదంతా ఎలా మొదలైంది..? దొంగలు మళ్లీ ఎలా యాక్టివ్ అయ్యారు..? అనే అంశాలపై ‘సాక్షి వెబ్‌డెస్క్’ ప్రత్యేక కథనం..

ఏం జరుగుతోంది..??
ఈ ఏడాది ఏప్రిల్ 21న మొదలైంది అసలు కథ. 'హానర్ 25' అనే ఆయిల్ ట్యాంకర్ సోమాలియా రాజధాని మొగాదిషుకు ఇంధనం తీసుకెళ్తుండగా, సముద్రపు దొంగలు దాన్ని హైజాక్ చేశారు. సరిగ్గా ఐదు రోజుల తర్వాత మరో షిప్‌ని, మే 2న మరో ట్యాంకర్‌ని ఇలా వరుసగా పట్టుకున్నారు. మధ్యలో కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా, జూలై 17న టంజానియాకు చెందిన 'అసన' అనే మరో ఆయిల్ ట్యాంకర్‌ని హైజాక్ చేశారు. ఈ నౌకల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఆయుధాలు ధరించిన సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడం.. సముద్రపు దొంగలకు కలిసి వచ్చింది. అంతేకాదు, పాత కాలం నాటి ట్రిక్కులన్నీ వీరు మళ్లీ వాడటం మొదలుపెట్టారు. ఒక పెద్ద షిప్‌ను 'మదర్ షిప్' (Mother Ship) లాగా వాడుకుంటూ, దాని నుంచి చిన్న స్పీడ్ బోట్లలో సముద్రంలోకి వచ్చి ఇతర నౌకలపై దాడులు చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఏకంగా 6 హైజాక్ చేసిన నౌకలను ఒకేసారి తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

అసలు ఈ సోమాలియా పైరెట్ల వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. 1991లో అంతర్గత యుద్ధాల వల్ల సోమాలియాలో ప్రభుత్వం కూలిపోయింది. దేశమంతా ముక్కలైపోయింది. అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వాలు లేవు. కోర్టులు లేవు. అసలు దేశాన్ని కాపాడే నౌకాదళం (Navy) కూడా కరువైంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న సోమాలియాలో.. పోలీసింగ్ లేకపోవడంతో.. ఐరోపా, ఆసియా దేశాలకు చెందిన భారీ ఇండస్ట్రియల్ ఫిషింగ్ నౌకల దోపిడీ మొదలైంది. అంతేకాదు.. అభివృద్ధి చెందిన దేశాల కంపెనీలు ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను (Hazardous Waste) సోమాలియా సముద్రంలో అక్రమంగా డంప్ చేయడం ప్రారంభించాయి.

 స్థానిక సోమాలియన్లకు చేపలు పట్టడమే ప్రధాన ఉపాధి. అలాంటిది విదేశీ ట్రాలర్లు వచ్చి చేపలన్నీ పట్టుకెళ్లిపోతుంటే.. సముద్రం విషపూరితంగా మారుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేకపోయారు. మొదట్లో తమ సముద్రపు వనరులను కాపాడుకోవడానికి 'వాలంటీర్ కోస్ట్ గార్డ్స్' అంటూ కొన్ని గ్రూపులు ఆయుధాలు పట్టాయి. విదేశీ ఫిషింగ్ నౌకలను ఆపి, జరిమానాలు వసూలు చేయడం మొదలుపెట్టాయి.

భయంకరమైన నేర సామ్రాజ్యం దిశగా..
కానీ, కొద్ది రోజులకు వాళ్లకు ఒక అసలు నిజం అర్థమైంది. చిన్న చిన్న ఫిషింగ్ నౌకలను బెదిరించడం కంటే, ఆ మార్గం గుండా వెళ్లే పెద్ద పెద్ద కమర్షియల్ షిప్‌లను పట్టుకుంటే కోట్ల రూపాయల రేన్సమ్ వస్తుందని తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఇది కేవలం 'రక్షణ' కాస్తా.. ఒక భయానక నేర సామ్రాజ్యంగా (Organized Crime Industry) మారిపోయింది..! సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌ల లాగా.. దొంగలకు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు తయారయ్యారు. 

బోట్లు, ఆయుధాలు, శాటిలైట్ ఫోన్లు కొనుగోలు చేయడానికి డబ్బులు ఇచ్చేవారున్నారు. యువకులను రిక్రూట్ చేయడం, నెగోషియేట్ చేయడం కోసం లాయర్లు, ట్రాన్స్‌లేటర్లు ఇలా ఒక పెద్ద వ్యవస్థే తయారైంది. ఒక విజయవంతమైన హైజాక్ జరిగితే, అప్పట్లో ఒక సాధారణ సోమాలియన్ యువకుడికి జీవితాంతం సంపాదించలేని సంపాదన ఒక్కసారే వచ్చేది. 2011 నాటికి ఈ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆ ఒక్క సంవత్సరంలోనే 230కి పైగా దాడులు జరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ పైరేట్ల కారణంగా ఏటా 7 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. హాలీవుడ్‌లో టామ్ హాంక్స్ నటించిన ప్రసిద్ధ సినిమా 'క్యాప్టెన్ ఫిలిప్స్' (Captain Phillips) కూడా ఇదే సోమాలియన్ పైరసీ నేపథ్యంలో వచ్చినదే..!

మళ్లీ మొదలైంది..!
2010ల చివరి నాటికి అమెరికా, చైనా, భారత్, ఐరోపా దేశాలన్నీ కలిసి ఒక భారీ నౌకాదళ కూటమిని ఏర్పాటు చేసి.. ఈ దొంగలను అణచివేశాయి. షిప్‌లలో ఆయుధాలు ధరించిన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టడంతో పైరసీ దాదాపుగా కనుమరుగైంది. గడిచిన మూడేళ్లుగా పలు దేశాలు యుద్ధాలతో బిజీబిజీగా ఉండడంతో.. మళ్లీ పైరెట్లు తమ పని మొదలు పెట్టారు.

 ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం (యెమెన్ హౌతీల దాడులు, ఇరాన్ యుద్ధం) కారణంగా ప్రపంచ దేశాల నేవీ వార్‌షిప్స్ అన్నీ ఆ ప్రాంతాల వైపు మళ్లాయి. సోమాలియా వైపు చూసేవారే కరువయ్యారు. దీంతోపాటు.. సోమాలియాకు అమెరికా ఇస్తున్న డెవలప్‌మెంట్ ఫండ్స్‌ను భారీగా తగ్గించడంతో, యువతకు ఉపాధి లేకుండా పోయి మళ్లీ పాత నేరాల వైపు ఆకర్షితులవుతున్నారు. 

వీటన్నింటికీ మించి.. యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ సోమాలియా పైరెట్లకు ఆయుధాలు, ట్రైనింగ్, ఇంటెలిజెన్స్ పరంగా సాయం చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మొత్తానికి, ప్రపంచమంతా మరిచిపోయిన ఈ సముద్రపు దొంగలు మళ్లీ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ముప్పును ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాల్సిందే..!

::హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement