మెుగదిషు : సోమాలియా దేశంలో సముద్రపు దొంగలు దారుణానికి తెగబడ్డట్లు తెలుస్తోంది. పుంట్‌ల్యాండ్ తీరానికి సమీపంలో LUTUF అనే కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌకను పైరేట్లు హైజాక్ చేసినట్లు సమాచారం . అయితే ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఆరుగురు భారతీయులున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమా కాదా అనే విషయం ధృవీకరించాల్సి ఉంది. భారత్ సైతం దీనిపై ఇది వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వివరాల్లోకి వెళితే పుంట్‌ల్యాండ్‌లోని ఈల్ జిల్లాలో మరయ్యా తీరానికి సుమారు 3.5 నాటికల్ మైళ్ల దూరంలో నౌకను ఎనిమిది మంది పైరేట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరు గతంలో ఏప్రిల్ 26న Sward అనే మరో వాణిజ్య నౌకను హైజాక్ చేసిన బృందంతో సంబంధం ఉన్నవారిగా భావిస్తున్నారు. అయితే హైజాకైన నౌకలో భారతీయులతో పాటు ఒక టర్కీ జాతీయుడు, ఒక జార్జియా జాతీయుడు, ఇద్దరు సెర్బియా భద్రతా సిబ్బంది ఉన్నారు.
ఈ నౌకలో టర్కీకి చెందిన ఆయుధాలు, కమ్యూనికేషన్ ,శాటిలైట్ పరికరాలు ఉన్నాయని, అవి మొగాదిషులోని టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి తరలిస్తున్నట్లు సోమాలి అధికారి తెలిపారు. ఈ ఘటనపై భారత, టర్కీ ప్రభుత్వాలు కూడా ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. టర్కీకి చెందిన రెండు నౌకలు, డ్రోన్లతో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


