ఏఐను విస్మరించడం ఇక సాధ్యం కాదని ఈ స్కూల్లో ఏం చేశారంటే? | Scotland inaugural artificial intelligence educator cautions students | Sakshi
Sakshi News home page

ఏఐను విస్మరించడం ఇక సాధ్యం కాదని ఈ స్కూల్లో ఏం చేశారంటే?

Oct 6 2026 8:15 PM | Updated on Oct 6 2026 8:23 PM

Scotland inaugural artificial intelligence educator cautions students

స్కాట్లాండ్‌లోని స్కూల్లో తొలిసారి ఏఐ బోధకుడి నియామకం

స్కాట్లాండ్‌లోని ఈస్ట్ రెన్‌ఫ్రూషైర్‌లో ఉన్న మీర్న్స్ క్యాసిల్ హైస్కూల్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రత్యేకంగా బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. యూకేలోనే ఏఐ అక్షరాస్యత కోసం ప్రత్యేక ప్రిన్సిపల్ టీచర్‌ బాధ్యతను ఏర్పాటు చేసిన తొలి పాఠశాల ఇదేనని భావిస్తున్నారు. విద్యార్థులు ఏఐని గుడ్డిగా నమ్మకుండా, దాని ద్వారా వచ్చే సమాచారాన్ని ప్రశ్నించి ధ్రువీకరించుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

గతంలో జీవశాస్త్ర విభాగం ప్రిన్సిపల్ టీచర్‌గా పనిచేసిన జేమీ లేకాక్ ఏఐ టీచర్‌ బాధ్యతలను చేపట్టారు. ఏఐను విస్మరించడం ఇక సాధ్యం కాదని, దాని వల్ల కలిగే అవకాశాలతో పాటు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. 

తొలి తరగతుల్లో విద్యార్థులకు నిజమైన, ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను కలిపి చూపించి వాటిలో నకిలీవి గుర్తించాలని అడిగారు. వాటిని వేరు చేయడం ఊహించినదానికంటే చాలా కష్టంగా అనిపించిందని లేకాక్ తెలిపారు. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నకిలీ చిత్రాలను గుర్తించడం రోజురోజుకూ కష్టమవుతోందన్నారు.

ఏఐలోని ‘హాల్యూసినేషన్‌’ అంశంపైనా విద్యార్థులకు బోధిస్తున్నారు. అంటే ఏఐ తనకు తెలియని విషయాలను కూడా నమ్మకంగా చెప్పడం. “హాల్యూసినేషన్‌ అనేది నిజానికి చాలా చెడ్డ పదం. కానీ ప్రాథమికంగా అది విషయాలను కల్పిస్తుంది” అని లేకాక్ చెప్పారు. ప్రాథమిక జ్ఞానం లేకపోతే ఏఐ చెప్పింది నిజమో, కల్పితమో గుర్తించడం యువతకు కష్టమవుతుందని వివరించారు.

చాట్‌బాట్‌లను మనుషుల్లా భావించే ‘ఆంత్రోపోమార్ఫైజేషన్‌’పైనా ఆయన హెచ్చరించారు. ఏఐ వినియోగదారులను పొగుడుతూ వారి ఆలోచనలను ఎప్పుడూ సమర్థించే స్వభావం కలిగి ఉండొచ్చని, దీనివల్ల దానిపై అతిగా ఆధారపడే ప్రమాదం ఉందన్నారు.

మీర్న్స్ క్యాసిల్‌లో ఎస్1, ఎస్2 విద్యార్థులందరికీ ఏఐ అక్షరాస్యత పాఠాలు అందించనున్నారు. ఉన్నత తరగతుల్లో పౌరసత్వం, వ్యక్తిగత విద్య తరగతుల్లో ఈ అంశాన్ని బోధిస్తారు. సీనియర్ విద్యార్థులకు ఐచ్ఛిక కోర్సు కూడా ఉంటుంది. లేకాక్ ఇతర ఉపాధ్యాయులకు ఏఐ వినియోగంపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర పాఠశాలలు ఉపయోగించగల బోధనా సామగ్రిని అభివృద్ధి చేయనున్నారు. 

కొందరు విద్యార్థులు భవిష్యత్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో విద్యార్థి అయ్డిన్ మాత్రం ఏఐని సమాధానాలు నేరుగా పొందేందుకు కాకుండా వాటిని అర్థం చేసుకునేందుకు సహాయక సాధనంగా ఉపయోగించాలని అన్నారు.

స్కాట్లాండ్ ప్రభుత్వం మార్చిలో విద్యా రంగంలో ఏఐ వినియోగానికి జాతీయ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏఐపై అతిగా ఆధారపడకుండా, మానవ సంబంధాలను భర్తీ చేయకుండా నైతికంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని అవి స్పష్టం చేశాయి. వేగంగా మారుతున్న ఏఐ సాంకేతికతపై ప్రభుత్వం నిరంతరం సమీక్ష కొనసాగిస్తుందని విద్యాశాఖ మంత్రి మైరీ మెక్‌అలన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement