ద.కొరియా గగనతలంలోకి రష్యా విమానాలు? | South Korea says Russian jets entered air defense zone | Sakshi
Sakshi News home page

ద.కొరియా గగనతలంలోకి రష్యా విమానాలు?

Nov 25 2026 1:18 AM | Updated on Nov 25 2026 1:18 AM

South Korea says Russian jets entered air defense zone

అత్యవసర హెచ్చరికలు చేసిన ద.కొరియా 

ప్రజలు భవనాల్లో దాక్కోవాలని సూచన 

ఆ వెంటనే ఉపసంహరణ  

సియోల్‌: ద.కొరియా, జపాన్‌ల మధ్య ఉన్న సముద్రజలాలపై రష్యా విమానాలు ఎగరడం మంగళవారం కలకలం రేపింది. పలు రష్యా విమానాలు తమ గగనతల రక్షణ గుర్తింపు జోన్‌లోకి ప్రవేశించాయని ద.కొరియా సైన్యం ఆరోపించింది. దీనివల్ల దేశ తూర్పు తీరంలోని ఒక ద్వీపంలో అత్యవసరంగా సైరన్‌లు మోగించాల్సి వచ్చిందని తెలిపింది. రష్యా విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని ద.కొరియా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

స్థానిక ప్రభుత్వం కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. కానీ కొంత సమయం తరువాత ఆ దేశ ముఖ్య సైనికాధికారి దాన్ని సవరించి కేవలం రక్షణ గుర్తింపు జోన్‌లోకి మాత్రమే వచ్చాయని స్పష్టం చేశారు.  ఈ ఉదంతం మొత్తం మంగళవారం ఉదయం మొదలైంది. విదేశీ విమానాలను గుర్తించిన ద.కొరియా సైన్యం 7.52 గంటలకు ఉల్లెయుంగ్‌ ద్వీపంలోని ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

ప్రజలు తక్షణమే భూగర్భ షెల్టర్లు లేదా సురక్షిత భవనాల్లో తలదాచుకోవాలని ఆదేశించింది. కానీ సరిగ్గా మూడు నిమిషాల తరువాత విమానాలు ప్రమాదకరమైన ప్రాంతాలను దాటిపోయాయని చెబుతూ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. సుమారు తొమ్మిది వేల జనాభా ఉన్న ఈ ద్వీపంలో ఎలాంటి ప్రమాదాలు గానీ, ఆటంకం గానీ కలగలేదని అధికారులు తెలిపారు. అయితే అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలను రంగంలోకి దించామని, ఆ తర్వాత రష్యన్‌ విమానాలు వెనుదిరిగాయని జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు.

అయితే, ఎన్ని రష్యన్‌ విమానాలు వచ్చాయి, అవి ఏ రకానికి చెందినవి అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉండగా... ఇటీవలి కాలంలో రష్యా విమానాలు తరచూ కొరియా ద్వీపకల్పం, జపాన్‌ల మధ్య సముద్ర జలాల మీదుగా ఎగురుతూండటంపై జపాన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల క్రితం రెండు రష్యన్‌ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ నిరసన తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement