పెళ్లిలో పెను ఉత్పాతం.. అతిథుల హాహాకారాలు | Australian wedding attendees employed chairs flooding | Sakshi
Sakshi News home page

పెళ్లిలో పెను ఉత్పాతం.. అతిథుల హాహాకారాలు

Oct 6 2026 9:22 PM | Updated on Oct 6 2026 9:22 PM

 Australian wedding attendees employed chairs flooding

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పెళ్లి వేడుక జరుగుతుండగా తీవ్ర ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం, వడగళ్ల వాన అతిథులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వేదిక పైకప్పుపై భారీగా వర్షపు నీరు, వడగళ్లు పేరుకుపోవడంతో పైకప్పులోని ఒక భాగం కిందకు వంగింది. పెళ్లికి వచ్చిన అతిథులు చెక్క కుర్చీలను ఉపయోగించి పైకప్పును పైకి నెట్టిపట్టుకున్నారు. అది మరింత కుంగిపోకుండా అడ్డుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో సూట్లు, ఇతర ఫార్మల్‌ దుస్తులు ధరించిన పలువురు అతిథులు వరుసగా నిలబడి కుర్చీలను తలపైకి ఎత్తి, వంగిపోయిన పైకప్పు భాగానికి ఆనించి పట్టుకోవడం కనిపించింది. అదే సమయంలో భారీ వర్షం, వడగళ్ల వాన పడింది.

వేడుక కోసం సిద్ధం చేసిన టేబుళ్లపై ప్లేట్లు, గ్లాసులు, న్యాప్‌కిన్లు ఉండగానే ఈ అనూహ్య పరిస్థితి ఎదురైంది. పైకప్పుపై పేరుకుపోయిన నీరు, వడగళ్ల బరువు కారణంగా పెద్ద నీటి మడుగు ఏర్పడినట్లు వీడియోలో కనిపించింది. అతిథులు కుర్చీల సాయంతో పైకప్పును పైకి నెట్టడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించారు.

వేదిక వెలుపల కూడా వాతావరణం తీవ్రంగా ఉన్నట్లు మరో వీడియోలో కనిపించింది. ప్రాంగణంలోని పచ్చికపై పెద్ద పరిమాణంలో వడగళ్ల ముక్కలు పేరుకుపోయాయి. ఈ పరిస్థితిని ఓ అతిథి అభివర్ణిస్తూ.. “ఆందోళన కలిగించడంతో పాటు కొంత హాస్యాస్పదంగా కూడా అనిపించింది” అని అన్నారు.

సిడ్నీ సహా న్యూ సౌత్ వేల్స్‌ ప్రాంతంలో తుపానుల ప్రభావంతో అత్యవసర సేవలకు 180కుపైగా కాల్స్‌ వచ్చాయి. పెళ్లి వేడుకలో సంబరాలకు బదులుగా అతిథులే తాత్కాలికంగా పైకప్పును కాపాడే పనిలో పడిన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement