source: X
క్రికెట్ స్కాట్లాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరహాలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ దేశ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం స్థానిక మహిళలు, బాలికలపై విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు అభ్యంతరాలు లేవని తెలిపింది. మానవ హక్కులు, మహిళల క్రికెట్ విషయంలో గణనీయమైన మార్పు వస్తేనే ఈ నిర్ణయంపై పునరాలోచన చేస్తామని స్పష్టం చేసింది.
ఆ ఒక్కడికి మినహాయింపు
అయితే ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడే స్కాట్లాండ్ ఆటగాళ్ల ఒప్పందాలకు మాత్రం క్రికెట్ స్కాట్లాండ్ గౌరవం ఇవ్వనుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) డ్రాఫ్ట్‌లో ఎంపికైన ఏకైక స్కాటిష్ ఆటగాడు జార్జ్ మున్సీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మున్సీ లేదా ఇతర స్కాటిష్ ఆటగాళ్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ పాల్గొనడాన్ని తాలిబన్ ప్రభుత్వానికి మద్దతుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.
కాగా, 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలు, ప్రజాజీవితంలో భాగస్వామ్యంపై పరిమితులు విధించారు. అంతేకాకుండా ఆ దేశంలో ఇప్పటికీ గుర్తింపు పొందిన మహిళల జాతీయ క్రికెట్ జట్టు లేదు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జింబాబ్వే


