చరిత్ర సృష్టించిన జింబాబ్వే | Zimbabwe create history, become first team to score 500 plus in both innings of Test match | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన జింబాబ్వే

Nov 10 2026 7:35 AM | Updated on Nov 10 2026 7:39 AM

Zimbabwe create history, become first team to score 500 plus in both innings of Test match

source: X

టెస్టు క్రికెట్‌లో జింబాబ్వే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టు ఇప్పటివరకు ఈ ఘనత సాధించలేదు. షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే ఈ అరుదైన ఘనత సాధించింది. ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ స్కోర్లు
ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 514 పరుగులు సాధించి 10 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ జింబాబ్వే బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఏకంగా 523/5 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. దీంతో టెస్టు చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది.

ఎర్విన్ డబుల్ సెంచరీ.. మదెవెరె తొలి టెస్టు శతకం
జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 279 బంతుల్లో 206 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు వెస్లీ మదెవెరె 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు.

41 ఏళ్ల 82 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఎర్విన్.. టెస్టు చరిత్రలో ఈ ఘనత అందుకున్న మూడో పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

డ్రాగా ముగిసిన తొలి టెస్టు
భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే తరఫున బ్రెండన్ టేలర్ 131 పరుగులు, బ్రియాన్ బెన్నెట్ 128 పరుగులతో రాణించారు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున రహ్మత్ షా 173 పరుగులు చేయగా.. సెదిఖుల్లా అటల్, రహ్మానుల్లా జద్రాన్ కూడా సెంచరీలు సాధించారు.

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌-జింబాబ్వే జట్టు షార్జా వేదికగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లోని రెండో టెస్టు నవంబర్ 13 నుంచి 17 వరకు షార్జాలోనే జరగనుంది. 

ఇదీ చదవండి: డ‌బుల్ సెంచ‌రీతో చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే బ్యాట‌ర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement