పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఘోరం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డలు 15 మంది సజీవ దహనం అయ్యారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మిలాద్ ఉన్ నబీ పూట నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇస్లామాబాద్ పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 16 మంది శిశువులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిలో ఒక్కరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
కారణం ఏంటంటే..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పిల్లల వార్డులోని ఎయిర్ కండిషనర్(AC) కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అధికారులు మాత్రం ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. తొలుత మృతుల సంఖ్యపైనా స్పష్టత రాలేదు. కాసేపటికే 15 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు స్థానిక జియో టీవీ కథనం ఇచ్చింది.
తెల్లవారుజామునే విషాదం
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి. నాలుగు ఫైరింజన్లు, ఆరు ఆంబులన్స్‌లు రెస్క్యూలో పాల్గొన్నాయి. అయితే బుధవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొంతసేపటి పాటు ‘కూలింగ్ ఆపరేషన్స్’ కొనసాగినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కన్నవాళ్ల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా శోకసంద్రంలో నిండిపోయింది. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.
🚨 TRAGIC: Fire at PIMS Hospital in Islamabad Kills 15 Newborns
AC compressor explosion in the gynecology ward sparks deadly blaze.#PIMS #Islamabad #Pakistan #BreakingNews@MarioNawfal pic.twitter.com/Z2exHnPX3J— DR ADNAN ALI (@DrMalko) August 26, 2026
ఇదీ చదవండి: భారత్‌లో ఆ మరణాలు.. షాకిచ్చిన నివేదిక


