చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో! | Meet China Tiangong Ultra, A Human-Like Body, Machine-Like Power And An AI Brain, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!

Aug 26 2026 9:11 AM | Updated on Aug 26 2026 10:41 AM

Meet China Tiangong Ultra With Human Body Machine Power AI Brain

మనిషి శరీరాన్ని పోలిన యంత్రుడు మరమనిషి. కానీ మనిషికి సాధ్యమైన పనులను మరింత వేగంగా, కచ్చితంగా చేయగలిగే శక్తి!. ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్‌ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. మనిషి, యంత్రం మధ్య ఉన్న తేడాను రోజురోజుకూ తగ్గిస్తోంది. ఈ మార్పునకు తాజా ఉదాహరణే ‘టియాన్‌గాంగ్‌ అల్ట్రా’.

చైనా మరోసారి సాంకేతిక ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈసారి కారణం కారు కాదు, క్షిపణి కాదు.. ‘టియాన్‌గాంగ్’ (Tiangong) అనే హ్యూమనాయిడ్ రోబోట్. మనిషిలా రెండు కాళ్లపై నడవడం, చకచకా మెట్లు ఎక్కడం, ఎత్తుపల్లాలపై బ్యాలెన్స్‌ కోల్పోకుండా ఉండడం, పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలతో ఈ రోబోట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణలో టియాన్‌గాంగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

జస్ట్‌ 8.86 సెకన్లలోనే..
బీజింగ్‌లో జరుగుతున్న 2026 వరల్డ్‌ హ్యూమనాయిడ్‌ రోబోట్‌ గేమ్స్‌లో.. 16 దేశాలకు చెందిన సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఇందులో టియాన్‌గాంగ్‌ అల్ట్రా తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల పరుగును కేవలం 8.86 సెకన్లలో పూర్తి చేసింది. ఇంతకు ముందు ఇదే రోబోట్‌ 9.39 సెకన్లతో ఉసేన్‌ బోల్డ్‌ రికార్డును అధిగమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టియాన్‌గాంగ్‌ కేవలం నడిచే రోబోట్‌ కాదు. పరుగులో వేగాన్ని పెంచుకుంటూనే తన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం, అడుగుల్లో చిన్న మార్పులు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా కదలికలను సరిచేసుకోవడం దీని ప్రత్యేకత. అలా బాక్సింగ్‌ సహా పలు కేటగిరీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.

అసలు టియాన్‌గాంగ్‌ అంటే?
టియాన్‌గాంగ్‌ అనే చైనీస్‌ పదానికి స్వర్గ భవనం అని అర్థం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలిన పూర్తి పరిమాణ హ్యూమనాయిడ్‌ రోబోట్‌ ఇది. బ్రెయిన్‌ను బట్టి మనిషి శరీరం ముందుకు నడుస్తుంది. ఇదే టియాన్‌గాంగ్‌ విషయంలో ఆ పనిని సెన్సర్లు, కంప్యూటింగ్‌ వ్యవస్థ, కృత్రిమ మేధ(AI) చేస్తాయి. చుట్టూ ఉన్న వస్తువులు, అడ్డంకులు, నేల పరిస్థితులను గుర్తించి.. వాటికి అనుగుణంగా తన కదలికలను మార్చుకుంటుంది.

కళ్లుగా కెమెరాలు.. చెవులే సెన్సర్లు
టియాన్‌గాంగ్‌కు మనిషిలా కళ్లూ, చెవులూ ఉండవు కదా! వాటి పనిని చేసే సాంకేతిక వ్యవస్థ ఉంది. కెమెరాలు, లిడార్‌ సెన్సర్లు, ఫోర్స్‌ సెన్సర్లు, ఇతర సెన్సింగ్‌ వ్యవస్థలు పరిసరాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను ఏఐ ఆధారిత కంప్యూటింగ్‌ వ్యవస్థ విశ్లేషిస్తుంది. ముందున్న అడ్డంకి ఎంత దూరంలో ఉంది? నేల సరిగ్గా ఉందా? అడుగు ఎక్కడ వేయాలి? వేగాన్ని తగ్గించాలా? పెంచాలా? వంటి విషయాలపై క్షణాల్లో నిర్ణయం తీసుకుని కాళ్లు, చేతులు, శరీర కదలికలను సమన్వయం చేస్తుంది. అందుకే టియాన్‌గాంగ్‌ నడకలో మెషిన్‌ కంటే మనిషి కదలికలను పోలిన సహజత్వం కనిపిస్తుంది.

తోసినా.. తడబడినా పడిపోదు!
హ్యూమనాయిడ్‌ రోబోట్లకు అతిపెద్ద సవాళ్లలో ఒకటి సమతుల్యం(బ్యాలెన్స్‌). రెండు కాళ్లపై నడిచే యంత్రం చిన్న పొరపాటుతోనైనా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే టియాన్‌గాంగ్‌ ఇందులో గణనీయమైన పురోగతి సాధించింది. ఎవరైనా తోసినా, నేల ఒక్కసారిగా మారినా శరీర బరువును మార్చుకుని తిరిగి బ్యాలెన్స్‌లోకి వచ్చేసేలా దీన్ని రూపొందించారు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ముందుగానే ఊహించి.. అవసరమైతే కదలికను మధ్యలోనే సరిచేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంటే.. మనిషి తడబడినప్పుడు వెంటనే కాలు మార్చి నిలబడినట్లే, ఈ రోబోట్‌ కూడా తన కదలికలను సర్దుబాటు చేసుకుంటుంది.

పరుగే కాదు.. ఇంకా చాలా
టియాన్‌గాంగ్‌ పేరు ఇప్పుడు 100 మీటర్ల పరుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నప్పటికీ.. దాని అసలు లక్ష్యం క్రీడా ప్రదర్శన కాదు. మనుషులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోట్లు చేపట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో యంత్రాల మధ్య పనిచేయడం, గోదాంల నుంచి వస్తువులను తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో శిథిలాల్లోకి వెళ్లడం వంటి పనుల్లో హ్యూమనాయిడ్‌ రోబోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంతే కాదు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం, ఆసుపత్రుల్లో కొన్ని పనులు నిర్వహించడం వంటి సేవల్లోనూ భవిష్యత్తులో వీటి వినియోగం పెరగొచ్చని రోబోటిక్స్‌ రంగం అంచనా వేస్తోంది.

ఒక్క రోబోట్‌ కాదు.. చైనా పెద్ద ప్రయోగం
టియాన్‌గాంగ్‌ను అభివృద్ధి చేసింది.. బీజింగ్‌ హ్యూమనాయిడ్‌ రోబోట్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రయోగం కాదు. ఇంజినీర్లు, రోబోటిక్స్‌ నిపుణులు, ఏఐ పరిశోధకులు, విద్యా సంస్థలు కలిసి పనిచేసిన పెద్ద ప్రాజెక్టు. హ్యూమనాయిడ్‌ రోబోటిక్స్‌ను భవిష్యత్‌ పరిశ్రమల్లో కీలక రంగంగా చైనా భావిస్తోంది. అందుకే పరిశోధన, తయారీ, ఏఐ సాంకేతికతలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ముందుకు వెళ్తోంది.

మనిషికి ప్రత్యామ్నాయమా?
టియాన్‌గాంగ్‌ అల్ట్రా రికార్డు చూసిన వెంటనే తలెత్తే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోబోట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా?. నిపుణుల దృష్టిలో ప్రస్తుతానికి సమాధానం అంత సులభం కాదు. హ్యూమనాయిడ్‌ రోబోట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మానవుడిలా అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గ్రహించడం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాల్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

మనిషి చేసే పనులను మనిషితో కలిసి చేయగలిగే తెలివైన యంత్రాల యుగం మొదలైంది. కేవలం 100 మీటర్లను 8.86 సెకన్లలో పరుగెత్తిన టియాన్‌గాంగ్‌ ఆ భవిష్యత్తుకు టీజర్‌ మాత్రమే. మనిషిలా ఆకారం.. యంత్రంలా శక్తి.. ఏఐ ఆలోచన.. టియాన్‌గాంగ్‌ రికార్డు కేవలం ఒక రోబోట్‌ గెలుపు కాదు రాబోయే సాంకేతిక ప్రపంచానికి చైనా ఇచ్చిన సంకేతం.

:::వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇదీ చదవండి: ఆ రహస్య విమానంలో వచ్చింది ఆయనేనంట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement