మాస్కోలో అర్ధరాత్రి అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఆగిపోయాయి! అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ఎందుకు ఇంత రహస్యంగా మాస్కోకు వచ్చారు? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ రష్యా అధికారులతో రహస్య చర్చల కోసం మాస్కో వచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ రహస్యంగా రష్యా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఎవరిని కలిశారు? ఎలాంటి అంశాలపై చర్చలు జరిపారు? అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం ఆయన రష్యా అధికారులతో సమావేశమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా సీఐఏ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా మీడియా ముందు ఈ పర్యటనను ధ్రువీకరించలేదు.
మాస్కోకు సి-17 గ్లోబ్‌మాస్టర్
మంగళవారం అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం సి-17 గ్లోబ్‌మాస్టర్-3 మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో దిగింది. విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ఈ విమానం తొలుత లాత్వియా రాజధాని రిగాకు చేరుకుని, అక్కడి నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా సైన్యానికి చెందిన ఈ విమానం సైనికులు, వాహనాలు, భారీ కార్గో రవాణాకు ఉపయోగిస్తారు.

అయితే విమానంలో ఎవరు ప్రయాణించారనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. లాత్వియా రక్షణ శాఖ మాత్రం ఈ విమానానికి తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, అవసరమైన సమన్వయం పూర్తయినట్లు తెలిపింది. ఆ వెంటనే విమానంలో సీఐఏ డైరెక్టర్ ర్యాట్‌క్లిఫ్ ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
U.S. Air Force Boeing C-17A Globemaster III strategic airlifter descending to land at the Vnukovo International Airport in Moscow on Tuesday morning.
The cameraman, likely sarcastically, comments: "we are under attack!" https://t.co/7EfvANBScW pic.twitter.com/dVItO5nAjn— Status-6 (War & Military News) (@Archer83Able) August 25, 2026
ఉక్రెయిన్‌కు అమెరికా కీలక సూచన
ర్యాట్‌క్లిఫ్ పర్యటనకు ముందు అమెరికా.. ఉక్రెయిన్‌కు కీలక సూచన చేసినట్లు సమాచారం. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌తో పాటు రష్యాలోని ఉత్తర ప్రాంతాలపై సోమవారం నుంచి బుధవారం వరకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది. రష్యా రాజధానికి ఓ సీనియర్ అమెరికా అధికారి ప్రయాణిస్తున్నారని కూడా కీవ్‌కు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామం అమెరికా–ఉక్రెయిన్ సంబంధాలపైనా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న ఉక్రెయిన్‌ను అమెరికా బహిరంగంగా సమర్థిస్తున్న సమయంలోనే.. సీనియర్ అమెరికా గూఢచార అధికారి మాస్కోకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ సీఐఏ చీఫ్ రాక
ర్యాట్‌క్లిఫ్ పర్యటన నిజమైతే.. 2021 తర్వాత రష్యా రాజధానికి అమెరికా గూఢచార సంస్థ అధిపతి వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ 2021 నవంబర్‌లో మాస్కో వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. ఆ భేటీ జరిగిన మూడు నెలలకే రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ప్రస్తుతం కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, మరోవైపు అమెరికా–రష్యా మధ్య సంబంధాలు సున్నితంగా ఉండటంతో ర్యాట్‌క్లిఫ్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
రష్యా–ఇరాన్ బంధం కూడా కీలకమే..
ర్యాట్‌క్లిఫ్ మాస్కో పర్యటన సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఇరాన్‌తో రష్యాకు ఉన్న సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇటీవల కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
రష్యా మాత్రం ఇరాన్‌తో సైనిక, ఆర్థిక, దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లు అందించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రష్యా.. ఇరాన్‌కు అమెరికా లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మాస్కో ఈ ఆరోపణలను ఖండించింది.
ఖైదీల మార్పిడిలోనూ కీలక పాత్ర
అమెరికా–రష్యా మధ్య ఖైదీల మార్పిడి వ్యవహారాల్లోనూ సీఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ర్యాట్‌క్లిఫ్ స్వయంగా 2025 ఏప్రిల్‌లో అమెరికా–రష్యా ద్వంద్వ పౌరురాలు క్సేనియా కరేలినా విడుదలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. 2024లో వాల్‌స్ట్రీట్ జర్నల్ విలేకరి ఇవాన్ గెర్ష్‌కోవిచ్, మాజీ అమెరికా మెరైన్ పాల్ వీలన్ విడుదలకు దారితీసిన ఖైదీల మార్పిడిలోనూ సీఐఏ ప్రమేయం ఉంది.
పుతిన్‌తో భేటీ ఉంటుందేమో!
ర్యాట్‌క్లిఫ్ మాస్కో పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాతో సంబంధాలు, ఇరాన్ అంశం, ఖైదీల మార్పిడి వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.
ఇదీ చదవండి: ఇరాన్‌పై కోపం.. భారత కంపెనీలకూ షాక్!


