ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ, ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ను ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్’ పురస్కారంతో సత్కరించారు. మనుషుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడటంలో చేసిన సేవలు, అలాగే ఉక్రెయిన్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందించారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ అందించిన స్టార్‌లింక్ సేవలు ఉక్రెయిన్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి.
2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో అనేక కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్ సైనికులు, కమాండర్లు, పౌరులకు కీలక కమ్యూనికేషన్ మార్గంగా మారింది. సైనిక కార్యకలాపాల్లో కూడా స్టార్‌లింక్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్లను నియంత్రించడం, దూర ప్రాంతాల్లో వాటితో కనెక్షన్ కొనసాగించడం వంటి కార్యకలాపాలకు ఇది సహాయపడుతోంది. దీంతో రష్యా సైనిక సరఫరా, లాజిస్టిక్స్‌పై ఉక్రెయిన్ ఒత్తిడి పెంచగలిగింది.
అయితే.. మస్క్ పాత్ర ఉక్రెయిన్‌కు ప్రయోజనంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తన భూభాగంలో స్టార్‌లింక్‌ను ఉపయోగించగలుగుతున్నప్పటికీ, రష్యా భూభాగంలో దాని వినియోగంపై పరిమితులు ఉన్నాయి. రష్యాపై దూరప్రాంత డ్రోన్ దాడులకు కూడా స్టార్‌లింక్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు. కానీ.. మస్క్ మాత్రం అలా చేయడం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా.. రష్యా దళాలు అనధికారికంగా ఉపయోగిస్తున్న కొన్ని స్టార్‌లింక్ టెర్మినల్స్‌ను బ్లాక్ చేయడానికి స్పేస్‌ఎక్స్ చర్యలు తీసుకుంది.


